పలువురి ప్రమేయంపై కొనసాగనున్న విచారణ సెటిల్‌మెంట్లు, దందాలే హత్యకు కారణం పూర్తిస్థాయిలో విచారిస్తేగాని నిజాలు బయటకు రానట్టే
పలమనేరు: చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన వి.కోట విలేకరి హత్య కేసులో పోలీసులు సాధించిన పురోగతి కొంతేనని తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన తమీమ్, సుభాన్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. హత్యకు సెటిల్‌మెంట్లే కారణమని తేల్చారు. అసలు విషయాలు ఇంకా తేలా ల్సి ఉందని సెలవిచ్చారు. జగన్‌కు ఉన్న శత్రువుల ప్రోద్భలంతోనే హత్య జరిగిందనే విషయాన్ని పోలీసులు పసిగట్టారు. ఈ క్రమంలో హత్యలో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉందన్న విషయం సస్పెన్స్‌గానే మారింది.
మూడుసార్లు హత్యకు స్కెచ్
జగన్‌ను అంతమొందించేందుకు తమీమ్, సుభాన్ గత నెల 23, 27వ తేదీల్లో ప్రయత్నించి విఫలమయ్యారని, 28న హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరిని ప్రేరేపించిన వారిలో శ్రీనివాసులుతోపాటు మరికొందరు ఉన్నట్టు గుర్తించారు. తమీమ్‌తో ఫోన్‌లో మాట్లాడిన, డీల్ కుదుర్చుకున్న 20 మందిని ఇప్పటికే పోలీసులు విచారించారు. ఈ హత్య కేసులో ఆరు ప్రత్యేక బృందాలు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నాయి.
పీడీ యాక్టు గ్యారెంటీ....
తమీమ్, సుభాన్‌పై ఉన్న కేసులు, హత్య కేసులో ఉన్న ప్రత్యక్ష సాక్షులు, వీడియో పుటేజీల ఆధారంగా పోలీసులు ఎస్పీ ద్వారా కలెక్టర్‌కు నివేదిక పంపించారు. తద్వారా వారిపై పీడీ యాక్టు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు పంపి రెండేళ్లు బెయిల్ రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు లో విచారణ సగమే అయిందని వి.కోట పోలీసులు పేర్కొనడం గమనార్హం.
ఇంకెంతమంది మెడకు చుట్టుకుంటుందో...
ఈ హత్య కేసు వి.కోటకు చెందిన ఇంకెంతమంది మెడకు చుట్టకుంటుందోననే భయం తప్పేలా లే దు. హత్యకు ప్రేరేపించిన వారు చాలామందే ఉన్న ట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ హత్యకు ప్రధాన కారణం ఇంకా మిస్టరీగానే మారింది. త్వరలోనే పూర్తి స్థాయిలో హత్యకు కారణాలు బయటపెడతామని వి.కొట పోలీసులు చెప్పడం గమనార్హం.
హత్యకు ఎన్నో కారణాలు
గతనెల 28న వి.కోట విలేకరి జగన్‌మోహన్‌రెడ్డిని అదే పట్టణంలో జనం చూస్తుండగా దారుణంగా కత్తులతో హత్య చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన నిందితులైన తమీమ్, అతని మేనత్త కొడుకు సుభాన్ ఇక్కడ ఉంటే ప్రాణ హాని ఉంటుందని భావించి బెంగళూరులోని ఒక పీఎస్‌లో ఎన్‌బీడ్యూ పెండింగ్‌లో ఉన్న కేసులో సరెండర్ అయ్యా రు. తర్వాత ఇక్కడి పోలీసులు వారిని పిటీ వారెంట్ కింద తీసుకొచ్చారు. ఈ నెల 12న కస్టడీలోకి తీసు కుని విచారించి ఆదివారం అరెస్ట్ చూపారు. ఇందు లో భాగంగా గతంలో జరిగిన ఓ విషయంలో విక్కీ, ఆరీఫ్ మధ్య వివాదం నెలకొంది. ఇందులో విక్కీకి తమీమ్ సాయం చేయగా ఆరీఫ్‌కు జగన్‌మోహన్‌రెడ్డి సాయం చేసినట్టు తేలింది. దీంతో ఆరీఫ్‌పై తమీమ్, సుభాన్ అలియాస్ మోహిన్ ద్వారా గంజాయి తప్పుడు కేసు పెట్టడం.. దీన్ని జగన్ అడ్డుకుని తమీమ్‌పై కేసు పెట్టేలా చేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలో శత్రువు, శత్రువు మిత్రుడనే కోణంలో వి.కోటకు చెందిన శ్రీనివాసులు మరికొందరు తమీమ్‌ను ప్రేరేపించి జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష పెంచుకునేలా చేసినట్టు తేలింది. ఈ సందర్భంలోనే హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు.


