చిత్తూరు రూరల్ (కాణిపాకం)/వి.కోట : భక్తి భావనలతో మహాకవి క్షేత్రయ్య వాడిన పదాలు దైవలీలలను చాటాయని, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, భారతీయ తెలుగు రచయితల సమాఖ్య అధ్యక్షుడు నారాయణస్వామి, ఎం.వి.కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేట్ భవనంలో ఆదివారం సాహితీవేత్త డాక్టర్ మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో మహాకవి క్షేత్రయ్య సాహితీ వైభవంలో భాగంగా గీతాలాపన, కవితార్చన నిర్వహించారు. వారు మాట్లాడుతూ క్షేత్రయ్య సిద్ధేంద్రయోగి సూచనలతో అనేక క్షేత్రాలు దర్శించి ఆయా దేవతలపై అనేక గీతాలు రచించారని తెలిపారు. తద్వారా మహాకవి క్షేత్ర య్య బిరుదుతో ప్రఖ్యాతి పొందారని పేర్కొన్నారు. రచయితల జిల్లా అధ్యక్షుడు తోట గోవిందన్ మాట్లాడుతూ క్షేత్రయ్య కంచి, చిదంబరం క్షేత్రాల్లో కవిగానే కాకుండా పరమ భక్త శిఖామణిగా కీర్తి పొందారని తెలిపారు. తెలుగు రాజులు పరిపాలించిన తంజావూరు, మధుర రాజ్యాల మధ్య సఖ్యత కు క్షేత్రయ్య ప్రయత్నించారని తెలిపారు. అనంతరం వి.కోట మండలానికి చెందిన కవులు కొఠారి వెంకటరత్నం, రఘుపతి తోపాటు పలువురు రచయితలు, గాయకులను సాహితీవేత్త మర్రిపూడి దేవేంద్రరావు సన్మానించారు. కార్యక్రమంలో ఎస్.మునీంద్ర, ఎం.కన్నయ్య నాయుడు, ఎం.శ్రీరాజు, జగదీష్, తాళ్లపాక వరలక్ష్మమ్మ, టి.మంజులాదేవి, కోటీశ్వర మొదలియార్, టి.ఎస్.ప్రవళ్లిక, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.


