కక్షతోనే
జగన్ హత్య
వి.కోట: సెటిల్‌మెంట్లకు అడ్డుపడుతున్నాడన్న కక్షతోనే రిపోర్టర్ జగన్‌మోహన్ తమీమ్ హత్య చేసినట్టు సీఐ సోమ శేఖర్‌రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. మదనపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు తమీమ్, సుభాన్‌ను ఇటీవల కస్టడీలోకి తీసుకుని విచారించామన్నారు. 2026 సెప్టెంబర్‌లో జరిగిన మత కలహాలలో తమీమ్‌పై మూడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. అతను జైలుకు వెళ్లాడని, దీంతో ముస్లింలు అతన్ని దూరంగా పెట్టారని తెలిపారు. ఇందులో జగన్‌మోహన్ పాత్ర ఉందని తమీమ్ భావించి కక్ష పెంచుకున్నాడని వెల్లడించారు. ఈ క్రమంలో జగన్‌మోహన్‌ను హత్య చేయాలని ఏప్రెల్ 20 నుంచి రెండుసార్లు ప్రయత్నించి విఫలమై 28వ తేదీన హత్య చేశాడన్నారు. తమీమ్‌ను బీఎస్పీ శ్రీనివాసులు ప్రేరేపించాడన్నారు. కేసులో అండగా ఉంటానని చెప్పాడని తెలిపారు. అతను నేరుగా హత్యను ప్రోత్సహించాడా..? లేక పరోక్షంగానా అన్న కోణంలో విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా ఎవరి పాత్ర ఉందా, ఇతనికి ఎవరెవరు సహకరించారు అన్న కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. ఇప్పటి వరకు 50 శాతం దర్యాప్తు పూర్తయిందన్నారు. తమీమ్‌పై వి.కోట పోలీసు స్టేషన్‌లో గంజాయి, గంధపు చెక్కల స్మగ్లింగ్ తదితర 12 కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు.


