చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని గురుకులాల్లో అడ్మిషన్ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరుగుతోందని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్డినేటర్ పద్మజ తెలిపారు. గురుకులాల్లో అడ్మిషన్ల సమాచారమేదీ అన్న శీర్షికన శనివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. విద్యార్థుల ఎంపిక, మార్కులు తదితర వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచినట్టు తెలిపారు. తమ నమోదిత ఫోన్ నంబరు, హాల్ టికెట్, ఆధార్ నంబర్లను ఉపయోగించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. అదేవిధంగా జిల్లాలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో అడ్మిషన్ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఎంపికై న 5వ తరగతి, జూనియర్ ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర గురుకుల శాఖ అధికారుల నుంచి మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయించినట్టు తెలిపారు. మొదటి జాబితాలో ఎంపికై న విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి 29 వరకు సర్టిఫికెట్లను పరిశీలించి అడ్మిషన్లను ఖరారు చేశామని వివరించారు. రాష్ట్ర అధికారులు విడుదల చేసిన రెండవ జాబితా విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ మే 6 నుంచి ప్రారంభమైందని, 19 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇందులో 5వ తరగతికి ఎంపికై న విద్యార్థులకు ఫోన్లు చేసి అడ్మిషన్లు ఆమోదిస్తున్నట్లు వెల్లడించారు. జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు మే 12న రెండవ జాబితా విడుదలైందని, వారికి మే 20వ తేదీ వరకు అడ్మిషన్లు కల్పించనున్నట్టు తెలిపారు.


