మృత్యు శకటం! | - | Sakshi
Sakshi News home page

మృత్యు శకటం!

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం

ఏడుగురికి తీవ్రగాయాలు..ఒకరి పరిస్థితి విషమం

అరుణాచలం నుంచి తిరుమల వెళుతుండగా ఘటన

మృతులు కర్నూలు వాసులు

పూతలపట్టు(యాదమరి): కర్నూలు నగరం బళ్లారి జంక్షన్‌కు చెందిన కృష్ణ(68) తమ కుటుంబ సభ్యు లు పది మందితో కలిసి కారులో గురువారం తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైలోని అరుణాచల క్షేత్రానికి బయలుదేరారు. రాత్రి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని శుక్రవారం ఉదయం మూడు గంటలకు తిరుగు పయనమయ్యారు. ఆరు గంటల ప్రాంతంలో చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారి చవటపల్లి వద్దకు చేరుకోగానే కారు నడుపుతున్న కృష్ణ కుమారుడు మనోజ్‌కుమార్‌ నిద్రలోకి జారుకున్నాడు. ఆ సమయంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది.

నుజ్జునుజ్జు అయిన కారు

లారీని ఢీకొన్న కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న కృష్ణ కోడళ్లు రమ్యశ్రీ(35), హేమలత(31) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రమ్యశ్రీ తల చిద్రమైంది. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న మనోజ్‌కుమార్‌ (40), విజయలక్ష్మి (52), కృష్ణ, హేమంత్‌(35), చిన్నారులు లోహిత్‌(11), చార్వి(6), కళ్యాణ్‌(5), సుహస్ర(4) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పూతలపట్టు సీఐ గోపి తన సిబ్బందితో అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో వారిని బయటకు తీసి చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కర్నూలులోని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు మరణించడంతో వారి సొంత ఊరిలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. ప్రమాద స్థలిని చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణ పరిశీలించారు. సీఐ గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రమ్యశ్రీ,హేమలత (ఫైల్‌)

చవటపల్లి వద్ద

ఘోర రోడ్డు ప్రమాదం

వరుస ప్రమాదాలతో ఆందోళన చెందుతున్న ప్రజలు

చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడంపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహన చోదకులు మితిమీరిన వేగంతో దూసుకెళుతున్నారు. పైగా రాత్రి సమయాల్లో నేషనల్‌ హైవే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై లారీలను నిలిపివేస్తున్నారు. దీంతో నిద్రమత్తులోకి జారుకుంటున్న మిగిలిన వాహనాల డ్రైవర్లు వాటిని ఢీకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇకనైనా సంబందిత అధికారులు జాతీయ రహదారిపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement