చిత్తూరు కలెక్టరేట్ : తప్పులు దొర్లకుండా రీ సర్వేను చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లో సర్వే, రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. గ్రామాల్లోని భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంలో మండల సర్వేయర్లు, వీఆర్వోల పాత్ర కీలకమన్నారు. గ్రామ సర్వేయర్లు తప్పనిసరిగా ఈకేవైసీ యాప్‌లో ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రాజకీయాలకు తావు ఇవ్వకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేయాలని హితవుపలికారు. అదేవిధంగా రీ సర్వేలో ప్రతి ఒక్క సర్వే నంబర్‌పై పట్టు ఉండాలని పలమనేరు ఆర్డీవో, డీఐవోఎస్‌కు సూచించారు. క్షేత్రస్థాయిలో రీసర్వేను పర్యవేక్షించాలన్నారు. వీఆర్వో లాగిన్, సర్వేయర్ లాగిన్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, సర్వేలో పురోగతి సాధించాలని ఆదేశించారు.
రికార్డుల తనిఖీ –
రైతులకు ముందస్తు నోటీసులు
గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి? పట్టా భూముల విస్తీర్ణం ఎంత? తదితర అంశాలపై స్పష్టత ఉండాలని కలెక్టర్ తెలిపారు. అలాగే వంకలు, పోరంబోకు భూములను క్షుణ్ణంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని విలేజ్ సర్వేయర్లను ఆదేశించారు. రీసర్వే నిర్వహించే సమయంలో సంబంధిత రైతులకు ముందుగా నోటీసులు ఇవ్వాలన్నారు. వారి సమక్షంలోనే సర్వే చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, పలమనేరు ఆర్డీవో భవాని, సర్వేశాఖ డీడీ జయరాజ్, డీఐవోఎస్ రమణారెడ్డి, ఏడీ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


