జిల్లాలో మొదలైన మామిడి సీజన్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో ఈసారి టేబుల్ రకాల మామిడి కాయలు మార్కెట్‌కు భారీగా వస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు నగరం కట్టమంచిలో ఉన్న మామిడికాయల మార్కెట్‌కు చక్కెర గుత్తి రకానికి వ్యాపారుల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తోంది. నాణ్యమైన గుత్తి రకం కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. మిగిలిన రకాల మామిడి ధరలు మాత్రం రైతులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. చాలాచోట్ల కిలో ధర రూ.40 లోపే ఉండడంతో సాగు ఖర్చులు కూడా రాకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా కేజీ కాదర్ రూ.30 నుంచి రూ.40, తోతాపురి (టేబుల్ రకం)– రూ.15, బేనీషా రూ.18 నుంచి రూ.25, చక్రగుత్తి రూ.80 నుంచి రూ.100 వరకు, దశేరి రూ.40, మల్లికా రూ.30 నుంచి రూ.40 పలుకుతున్నాయి. ఈరకమైన కాయలన్నీ రాజస్థాన్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. అలాగే కొన్ని ఫ్యాక్టరీలు కాదర్‌ను కొనుగోలు చేస్తుండగా కేజీ ధర రూ.25లు మాత్రమే పలుకుతున్నాయి.
కవర్లు కట్టిన కాయలకు డిమాండ్
మార్కెట్‌లో ఈసారి కవర్లు కట్టిన మామిడి కాయలకు ప్రత్యేక ఆదరణ కనిపిస్తోంది. రంగు, నాణ్యత మెరుగ్గా ఉండటం వల్ల వ్యాపారులు అలాంటి కాయలను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఎగుమతులకు అనువైన కాయలపై కూడా వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రైతులు ముందు జాగ్రత్తలతో పండ్ల సంరక్షణపై దృష్టి పెట్టారు. కవర్లు కట్టిన బేనీషా కేజీ రూ.50గా అమ్ముడుబోయింది. స్థానికంగానే ఈ కాాయలు అమ్ముడుబోతున్నాయి.
చిత్తూరు మార్కెట్‌కు వచ్చిన మామిడి కాయలు
మార్కెట్‌కు వచ్చిన చక్కెర గుత్తి కాయలు
ప్రతి ఏటా మామిడి రైతులకు నష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించడం లేదు. ఈ సారైనా మద్దతు ధర లభిస్తుందా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ ప్రారంభమైంది. ప్రధాన మామిడి మార్కెట్లలో ఒకటైన చిత్తూరుకు రోజురోజుకూ కాయల రాక పెరుగుతోంది. మార్కెట్‌లో ఇప్పటికే 16 దుకాణాలు తెరుచుకున్నాయి. రైతులు మామిడి కాయలను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం టేబుల్‌రకాలు వస్తున్నాయి. చక్కెర గుత్తి రకం కాయలు కేజీ రూ.80 నుంచి రూ.100 పలుకుతుండగా.. మిగిలిన రకాలు మాత్రం రూ.40 లోపు పలుకుతున్నాయి.
పెరిగిన ఖర్చులు.. తగ్గిన ధరలు
ఈ సారి మామిడి సాగుకు భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు, నీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, మార్కెట్‌లో సరైన ధరలు రాకపోవడం మరింత భారంగా మారిందని వాపోతున్నారు. ముఖ్యంగా టేబుల్ రకాల మామిడి కాయలకు డిమాండ్ ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ధరలు లేవని చెబుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మామిడికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మద్దతు ధర ఇవ్వాలి
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కనీస మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలి. కవర్లు కట్టిన బేనీషా కాయలు కేజీ రూ.50లకు అమ్మినా, తోతాపురి ప్రధానం. వీటికి ప్రభుత్వం మద్దతు ధర ఇస్తేనే రైతులు నష్టాల బారిన పడకుండా ఉంటారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.
– విజయనాయుడు, వరదరాజులపల్లి, చిత్తూరు మండలం
కోతకోయాలంటే భయంగా ఉంది
టేబుల్ రకాల ధరలు కాస్త నిరాశ పరుస్తున్నాయి. ఇంకొద్దిగా రేట్లు వస్తే బాగుంటుంది. మామిడి సాగు, పురుగుల మందు పిచికారీ, కూలీల ఖర్చులు అమాంతంగా పెరిగిపోయాయి. కాయల ధరలు పాతాళంలో ఉన్నాయి. కాయలు కోత కోయాలంటేనే భయంగా ఉంది. ధరలు నిలకడగా, రైతులకు గిట్టుబాటు అయ్యేవిధంగా చూడాలి.
– సుబ్రమణ్యంనాయుడు, ఎగువకండ్రిగ, చిత్తూరు మండలం


