డంపే ధనం...! | - | Sakshi
Sakshi News home page

డంపే ధనం...!

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

డంప్‌ చేసి జేబులు నింపుకుంటున్న టీడీపీ నేతలు విచ్చలవిడిగా తమిళనాడుకు తరలింపు టిప్పర్‌ ఇసుక రూ.1.30 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు అమ్మకం కలెక్టర్‌, ఎస్పీ, సీఎంవో కార్యాలయానికి సొంత పార్టీ నేతల ఫిర్యాదులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌పేట ప్రాంతంలో ఇసుక వనరులున్నాయి. చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ్ముళ్లు ఇసుక అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ నేత పలు ప్రాంతాల నుంచి ఇసుక తవ్వి పాలూరు వద్ద డంప్‌ చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు. అక్కడి నుంచి ఇసుక కొరత ఉన్న ప్రాంతాలకు తరలించాలన్నది ఆయన ఉద్దేశం. డంప్‌ నుంచి ఇసుక తరలించేందుకు అనుమతులు రాలేదు. ఒక వేళ అనుమతులున్నా.. డంప్‌ ప్రాంతంలో సీసీ కెమెరాల నిఘా ఉండాలి. బిల్లులు ఇవ్వాలి. అధికారుల పర్యవేక్షణ ఉండాలి. రికార్డులు నిర్వహించాలి. ప్రభుత్వానికి నిర్ణీత ధర చెల్లించాలి. ఇవేవీ లేకుండా డంప్‌ పేరు చెప్పి టీడీపీ నేతలు దందాకు శ్రీకారం చుట్టారు. రెండేళ్లుగా పగలు ఇసుకను డంప్‌ చేసి రాత్రిళ్లు తమిళనాడుకు తరలించడమే పనిగా పెట్టుకున్నారు.

గడువు ముగిసినా...

చిత్తూరు మండల పరిధిలో గతంలో అనుమతులతో ఏర్పాటు చేసిన ఇసుక డంప్‌కు మార్చి నెలతో గడువు ముగిసింది. అయినప్పటికీ నేతలు అదే డంప్‌ పేరుతో భారీగా ఇసుకను నిల్వ చేస్తున్నారు. ముఖ్యంగా శెట్టిన్‌ తంగాల్‌, ఆనగల్లు నుంచి ఇసుక తీసుకొచ్చి పాలూరు వద్ద డంప్‌ చేసి రాత్రి తమిళనాడుకు తరలిస్తున్నారు. అక్కడ టిప్పర్‌ ఇసుక రూ.1.30 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు విక్రయిస్తున్నారు. టిప్పర్లు పాలూరు డంప్‌ నుంచి ఇసుక తీసుకుని బీఎన్‌ఆర్‌పేట వద్ద క్రాస్‌ చేసి తాళంబేడు, గుడిపాల చీలాపల్లి క్రాస్‌, అక్కడి నుంచి తమిళనాడుకు వెళుతున్నాయి.

చిత్తూరు మండలంలో ఇసుక అక్రమ రవాణా

చిత్తూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా భారీగా సాగుతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ, గడువు ముగిసిన ఇసుక డంప్‌ల పేరుతో కొందరు అధికార పార్టీ నేతలు, మధ్యవర్తులు, ఇసుక మాఫియా కలిసి రూ.కోట్ల అక్రమ వ్యాపారాన్ని నడుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకృతి సంపదను విచక్షణారహితంగా దోచుకుంటూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. దీనిపై కలెక్టర్‌, ఎస్పీ, సీఎంవో కార్యాలయనికి ఫిర్యాదులు చేసినట్టు సమాచారం.

సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేస్తున్నారు

అక్రమ ఇసుక రవాణాపై సొంత పార్టీ నేతలే జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో పాటు సీఎంవో కార్యాలయానికి ఫిర్యాదులు చేశారు. ఫొటోలు, బండి నంబర్లు వీడియోలు తీసి పంపినట్టు పేర్కొంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే మంత్రి నారాలోకేష్‌కే ఫిర్యాదు చేస్తామని బహిరంగంగా చెబుతున్నారు. రాజకీయ అండ లేకుండా ఇసుక దందా సాధ్యమేనా..? అన్న ప్రశ్నలు చిత్తూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారా యి. అదే మాదిరిగానే ఓ ప్రజాప్రతినిధికి ఈ ఫిర్యాదులు తలనొప్పిని తెచ్చిపెట్టాయి. సొంత పార్టీ నేతలే కలెక్టర్‌, ఎస్పీ, సీఎంవో ఆఫీసుకు ఫిర్యాదు చేయ డం ఏమిటని ఆ ప్రజాప్రతినిధి లోలోపల రగిలిపోతున్నారు. ఈ ఫిర్యాదుల వెనుక సీనియర్‌ నాయకుల హస్తం ఉందని కొందరు నేతలు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement