– ఏపీపీజీఈసెట్ రాష్ట్ర 2వ ర్యాంకర్ రాహుల్‌చౌదరి
బంగారుపాళెం : ఎంటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలన్నదే తన లక్ష్యమని ఏపీ పీజీ ఈసెట్ పరీక్షలో కాకర్ల రాహుల్‌చౌదరి తెలిపా రు. మండలంలోని గుంతూరు గ్రామానికి చెందిన రైతు కాకర్ల వేణుగోపాల్ నాయుడు, లలిత దంపతుల కుమారుడు రాహుల్‌చౌదరి ఏపీ పీజీ ఈసెట్ పరీక్ష ఫలితాల్లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించాడు. అతను 10వ తరగతి వరకు బంగారుపాళెం సెయింట్‌మేరీ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఇంటర్ పూతలపట్టులో ఉన్న మంగల్ విద్యాలయంలో, బీటెక్ (సీఎస్‌ఈ) బెంగళూరులోని గీతం యూనివర్సిటీలో పూర్తిచేశాడు. ఎంటెక్‌లో చేరేందుకు నిర్వహించిన ఏపీ పీజీ ఈసెట్‌లో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూశానని తెలిపాడు. 10 ఏళ్ల ప్రశ్న పత్రాలను సేకరించి ప్రిపేర్ అయినట్టు పేర్కొన్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయి వారి కలలను సాకారం చేస్తానని విద్యార్థి రాహుల్‌చౌదరి తెలిపాడు.
ముగిసిన
‘పవర్’ వివాదం!
యాదమరి: మండలంలోని దాసరాపల్లిలోని శ్రీ ధర్మరాజుల ఆలయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై నడుస్తున్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వ జీవో ప్రకారం దేవదాయశాఖ ఆ భూములను 30 ఏళ్లు సోలార్ ప్లాంట్‌కు కేటాయించింది. ఆ నిర్ణయాన్ని స్థానికులు, రైతులు వ్యతిరేకించారు. జిల్లా కలెక్టర్‌కు, సంబందిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. రైతుల వినతులపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఆ భూములు ప్రభుత్వానికి చెందివని, సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసిందని తెలిపారు. దీనికి అడ్డుచెప్పడానికి ఎవరికీ హక్కు లేదన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్, ఎస్‌ఐ ఈశ్వర్ సమక్షంలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇక మీదట పవర్ ప్లాంట్ పనులకు ఎలాంటి ఆటంకాలు సృష్ఠించబోమని రైతు నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పరందామ గౌడ్, చిట్టి నాయు డు, ఓబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జూన్ 5 నుంచి ‘సర్’
తిరుపతి అర్బన్: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 5 నుంచి ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు ఎస్‌ఐఆర్‌పై ఓటర్ల జాబితాకు సంబంధించి సన్నాహాలు, శిక్షణతోపాటు ముద్రణ ఉంటుందని చెప్పారు. అలాగే జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బూత్‌లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో) ఇంటింటా పర్యటిస్తారని చెప్పారు. మరోవైపు జూలై 14వ తేదీన పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జూలై 21వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ చేస్తామని పేర్కొన్నారు. అలాగే జూలై 21 నుంచి ఆగస్టు 20 తేదీ వరకు దావాలు, అభ్యంతరాల కాలం జరుగుతుందన్నారు. మరోవైపు జూలై 21 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు నోటీసు దశ, పరిష్కారానికి సంబంధించిన దావాలు, అభ్యంతరాలు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. చివరిగా సెప్టెంబర్ 22న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామన్నారు.
ఎర్రచందనం కేసులో
ఒకరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడు, వేలూరు జిల్లా, ఆర్కాట్ తాలూకా, మస్సురుపాళేనికి చెందిన సి.నాగరాజన్‌కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 2017లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం తిరుపతి, చైన్నె రోడ్డు, గాజుల మండ్యం జంక్షన్ సమీపంలో తనిఖీ చేసింది. నిందితుడు నాగరాజన్ లారీలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ ఫారెస్ట్ సిబ్బందికి పట్టుపడ్డాడు. ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
రైలు కింద పడి
వ్యక్తి ఆత్మహత్య
రైల్వేకోడూరు అర్బన్: పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి ఇంటర్‌సిటీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు జీన్స్‌ప్యాంటు, తెల్లచొక్కా ధరించి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.


