కాపలాదారుడే దొంగ | - | Sakshi
Sakshi News home page

కాపలాదారుడే దొంగ

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

● విద్యుత్‌ స్తంభాలను చోరీ చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగి ● టీడీపీ నాయకుడి కనుసన్నల్లోనే దోపిడీ?

శ్రీరంగరాజపురం : ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి విద్యుత్‌ స్తంభాలు, పరికరాలను చోరీ చేసి విక్రయించిన సంఘటన మండలంలోని మంగుంట గ్రామంలో వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. మంగుంట గ్రామానికి చెందిన రామిరెడ్డి అంకనపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో కాంట్రాక్ట్‌ షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతి గ్రామంలోనూ 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌డీఎస్‌ సంస్థకు విద్యుత్‌ కాంట్రాక్ట్‌ పనులను కేటాయించింది. కాంట్రాక్ట్‌ షిఫ్ట్‌ ఆపరేటర్‌ రామిరెడ్డి మంగుట గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడి అండతో విద్యుత్‌ స్తంభాలను చోరీ చేసి తన పొలానికి తరలించి జేసీబీతో పూడ్చిపెట్టాడు. తర్వాత వాటిని రాత్రిళ్లు కోళ్లఫారానికి విక్రయిస్తున్నాడు. గమనించిన స్థానికులు విద్యుత్‌ అధికారులతోపాటు విద్యుత్‌ కాంట్రాక్ట్‌ సంస్థకు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టి విద్యుత్‌ స్తంభం చోరీకి గురైనట్టు గుర్తించి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఒక టీడీపీ నాయకుడు తనకు చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, అన్నీ తాను చూసుకుంటానంటూ చెప్పినట్టు సమాచారం. కాంట్రాక్ట్‌ ఉద్యోగి రామిరెడ్డి వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ మార్చలన్నా, కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా రైతుల నుంచి పెద్ద మొత్తంలో నగదు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement