కాపాడింది లేదు! | - | Sakshi
Sakshi News home page

కాపాడింది లేదు!

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

జిల్లాలో పడకేసిన పల్లె పశువైద్యం రైతు భరోసా కేంద్రాలకు తాళాలు పశుసంవర్థక శాఖ సహాయకుల ఇష్టారాజ్యం ఫోన్‌ చేస్తే సర్వేలు, మీటింగ్‌లంటూ కుంటి సాకులు సమయానికి చికిత్స అందక మృత్యువాత పడుతున్న పశువులు అయోమయంలో పెంపకందారులు

జిల్లాలో పశుసంవర్థక సహాయకుల తీరు రోజురోజుకూ తీసికట్టుగా మారుతోంది. జబ్బు చేసిన పశువులకు సకాలంలో వైద్యం అందించకుండా గాలితిరుగుడు తిరుగుతుండడం విమర్శలకు తావిస్తోంది. పెంపకందారులు ఫోన్‌ చేసినా సర్వేలు..మీటింగ్‌లంటూ కుంటిసాకులు చెప్పడం రివాజుగా మారుతోంది. దీనిపై సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

కాణిపాకం: జిల్లాలో ప్రస్తుతం 297 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వీటి కింద 253 మంది పశుసంవర్థక శాఖ సహాయకులు పనిచేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక వీటి సంరక్షణపై దృష్టి సారించింది. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి పశుసంవర్థక సహాయకులను నియమించింది. వీరు పల్లెల్లో పశువులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించే వారు. తక్షణమే వైద్య సేవలందించేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసింది. దీంతో పల్లె పశువైద్యం పడకేసింది.

సాకులెక్కవ

పశువులకు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు రైతులు సహాయకులకు ఫోన్‌ చేస్తే స్పందన ఉండడం లేదు. ఫోన్‌ ఎత్తినా సర్వేలో ఉన్నాం.. మీటింగ్‌లో ఉన్నాం.. ఇంకో గ్రామంలో కేసు ఉంది.. తర్వాత వస్తాం... అంటూ తప్పించుకుంటున్నారు. చాలాసార్లు గంటల తరబడి ఎదురు చూసినా సిబ్బంది రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. కొన్ని గ్రామాల్లో పశువులకు ప్రసవ సమస్యలు వచ్చినా వైద్యసిబ్బంది అందుబాటులో లేక ప్రైవేట్‌ వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది.

సేవలు శూన్యం

కొన్ని కేంద్రాల్లో రికార్డుల్లో మాత్రం అన్ని సేవలు అందిస్తున్నట్లు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మందుల పంపిణీ, చికిత్స, పర్యటనలు జరిగినట్లు నమోదు చేస్తున్నా.. వాస్తవంగా రైతులకు సేవలు అందడం లేదని చెబుతున్నారు. పలు గ్రామాల్లో పశుసంవర్థక శాఖ సిబ్బంది నెలల తరబడి పర్యటించకపోయినా రికార్డుల్లో మాత్రం సందర్శించినట్లు నమోదు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సహాయకుల నిర్లక్ష్యంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

హాజరు వేసి డుమ్మా

జిల్లాలోని పలు రైతు భరోసా కేంద్రాల్లో విధులకు సకాలంలో హాజరవుతున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఉదయం కార్యాలయానికి వచ్చి అటెండెన్స్‌ వేసిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్టు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల మధ్యాహ్నం కాకముందే కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. రైతులు పశువులను తీసుకొచ్చినా.. కేంద్రాలు మూసి ఉండడంతో నిరాశగా వెనుదిరగడం రివాజుగా మారుతోంది. మరికొందరు సహాయకులు విధుల్లో ఉండాల్సిన సమయంలో గ్రామాల్లో తిరుగుతూ వ్యక్తిగత పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ‘పశువైద్యం కోసం వస్తామని చెబుతారు.. కానీ కనిపించరు’ అని రైతులు మండిపడుతున్నారు.

పర్యవేక్షణ ఏదీ

పశుసంవర్థక శాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన సహాయకుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం, బాధ్యతారాహిత్యంతో గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. అత్యవసర పరిస్థితుల్లో కూడా వైద్యసేవలు అందక పాడిపశువులు మృత్యువాతపడుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement