చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పుత్తూరు పట్టణం చుట్టూ గుట్టలు ఉండడంతో అక్రమ రవాణాదారులు రెచ్చిపోతున్నారు. మొన్న మరాఠిగేట్ గుట్ట, నిన్న చెర్లోపల్లి గుట్ట, నేడు చిన్నబ్బనాయుడుకండ్రిగగుట్టను లోడేస్తున్నారు. సమీపానే తమిళనాడు రాష్ట్రం ఉండడంతో ఈ అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పట్టపగలే హిటాచీలు పెట్టి మరీ గుట్టను తవ్వేస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అండతోనే అంతా జరుగుతోందని, అందుకే అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు చర్చించుకొంటున్నారు.
పుత్తూరు: పట్టణంలోని గుట్టలు, చెరువులు, కాలువలు కబ్జాలకు గురవుతున్నాయి. పట్టణ జనాభా రోజు రోజుకూ పెరిగిపోవడంతో ఇళ్ల నిర్మాణాలకు మట్టి అవసరాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు పట్టణంలోని పలు గుట్టల నుంచి నిత్యం మట్టిని తరలిస్తున్నారు. ఇదే అదనుగా ఆక్రమ రవాణాదారులు గుట్టలను లక్ష్యంగా చేసుకొని యథేచ్ఛగా తమిళనాడుకు మట్టిని తరలిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. గుట్టల్లో ముందుగా ఎర్రమట్టిని క్యాష్ చేసుకోవడంతో పాటు ఖాళీ స్థలాల ఆక్రమణలకు పాల్పడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులోని చిన్నబ్బనాయుడుకండ్రిగ గుట్టను గత వారం రోజులుగా హిటాచీల సాయంతో తవ్వుతున్నారు. ప్రతిరోజూ టిప్పర్ల ద్వారా తమిళనాడుకు మట్టిని తరలిస్తున్నారు. రాత్రి, పగలు తేడాలేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఈ అక్రమ రవాణా సమాచారాన్ని అందించినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నేషనల్ హైవే ముసుగులో దోపిడీ
తిరుపతి–చైన్నె జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు ఎన్‌హెచ్ వారికి మరాఠిగేట్ గుట్ట నుంచి మట్టిని తరలించుకొనేందుకు అధికారులు అనుమతులిచ్చారు. అయితే ఎన్‌హెచ్ పేరిట అక్రమార్కులు ప్రతి గుట్ట నుంచి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే ఎన్‌హెచ్ పనుల కోసం అంటూ తప్పించుకొని పబ్బం గడుపుకుంటున్నారు. ఈ తంతు రెవెన్యూ అధికారులకు తెలిసే జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా మట్టి తరలింపులతో ఏర్పడిన ఖాళీ స్థలాలను ఆక్రమించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణ పరిధిలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులైన గుట్టలు మాయమవుతున్నాయంటూ స్థానికులు గగ్గోలు పెడుతున్నారు.
చిన్నసుబ్బనాయుడుకండ్రిగ గుట్టను తవ్వేస్తున్న హిటాచీ


