యోగా రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

యోగా రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తున్న యోగా 365 కార్యక్రమానికి అర్హత, ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్‌ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం యోగాను సామూహిక ఉద్యమంగా ప్రోత్సహించేందుకు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ యోగా 365 కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో మోరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా, హ్యాబిల్ట్‌ హెల్త్‌ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో ఉచిత శిక్షణ ఇస్తారన్నారు. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో 100 రోజుల ఉచిత ప్రత్యక్ష యోగా తరగతులను నిర్వహిస్తుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లాలోని క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, అన్ని వయస్సుల సాధారణ ప్రజలు పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్‌ కోసం 18003157008 నంబర్‌లో సంప్రదించాలన్నారు. గతంలో ఐడీవై 2025లో పేరు నమోదు చేసుకున్న వారు ప్రస్తుతం కొనసాగుతున్న యోగా 365లో చేరాలని కోరారు.

ఆ పంచాయతీల్లో

కొత్త బోర్లు నిషేధం

పలమనేరు: జిల్లాలోని ఎనిమిది గ్రామాల్లో కొత్త బోర్ల తవ్వకాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వాల్టా చట్టం–2002 మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో మోతాదుకు మించి నీటి వినియోగంతో భూగర్భజలాలు అడుగంటాయని పేర్కొన్నారు. ఆయా మండలాల్లో కొత్త బోర్లు, ఇసుక తవ్వకాలు చేపట్టరాదని అందులో పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో వీకోట, రామకుప్పం, శాంతిపురం, కుప్పం, గుడిపల్లి, పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి మండలాల్లోని ఏడు గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రమే బోర్లను డ్రిల్‌ చేసే వెసులుబాటు కల్పించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఆయా మండలాల గ్రామ పంచాయతీలకు సైతం పంపారు. ఈ నిషేధిత డార్క్‌ ఏరియాల్లో బోర్లకు కరెంట్‌ సర్వీసులు కూడా ఇవ్వరని అందులో పేర్కొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఫిజియోథెరపీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఉన్న భవిత కేంద్రాల్లో దివ్యాంగులకు సేవలందించేందుకు ఏడు ఫిజియోథెరపీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీపీటీ, ఎంపీటీ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులన్నారు. జిల్లాలోని చిత్తూరు, యాదమరి, గుడిపాల, బంగారుపాళ్యం, తవణంపల్లి, ఐరాల, రొంపిచెర్ల, పులిచెర్ల, పూతలపట్టు, పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, రామకుప్పం, వి.కోట, బైరెడ్డిపల్లి, పెనుమూరు, జీడీ నెల్లూరు, వెదురుకుప్పం, కార్వేటినగరం, ఎస్‌ఆర్‌పురం, పాలసముద్రం మండలాల్లోని భవిత కేంద్రాల్లో సేవలందించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు జిల్లా సమగ్రశిక్షశాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఏపీసీ సూచించారు.

మోదీ పిలుపుతో

దేశం అభివృద్ధి

చిత్తూరు అర్బన్‌: దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు తప్పనిసరిగా ఉపయోగపడుతుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. గురువారం చిత్తూరులోని తన కార్యాలయంలో ఎంపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక భద్రతకు వంటగ్యాస్‌ నుంచి వాహన ఇంధనం, బంగారు ఆభరణాల కొనుగోలు వరకు పొదుపు పాటించాలన్నారు. దీనివల్ల విదేశీమారకం బలపడుతుందన్నారు. రూపాయి విలువ పెరుగుతుందని తెలిపారు. ప్రజలు దీన్ని అర్థంచేసుకుని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలని కోరారు.

డీఈ బదిలీ

చిత్తూరు కార్పొరేషన్‌: చిత్తూరు డివిజన్‌ ఆర్‌అండ్‌బీ క్వాలిటీ కంట్రోల్‌ డీఈ శ్రీధర్‌ప్రసాద్‌ను అనంతపురం డివిజన్‌ ఈఈగా పదోన్నతి పై బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాకు ఉత్తర్వులు అందాయి.

Advertisement
 
Advertisement
Advertisement