శక్తి సంబరం | - | Sakshi
Sakshi News home page

శక్తి సంబరం

May 14 2026 6:51 AM | Updated on May 14 2026 6:51 AM

చిత్తూరులో వైభవంగా గంగమ్మ నిమజ్జనోత్సవం

కనులపండువగా అమ్మవారి దివ్యరూపం

వినూత్నంగా ఓం శక్తి భక్తుల విన్యాసం

మొక్కులు చెల్లించుకున్న అశేష భక్తజనం

సంపూర్ణం..

నడివీధి గంగమ్మ సేవకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిన వీధులు.. ఒళ్లు గగుర్పొడిచేలా ఓంశక్తి మాలధారుల విన్యాసాలు.. సంప్రదాయబద్ధంగా కొలుపులు.. శ్రవణానందంగా డప్పు వాయిద్యాలతో బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన అమ్మవారి నిమజ్జనోత్సవంతో జాతర సంబరం సంపూర్ణమైంది. మహిమాన్విత దివ్యరూప దర్శనంతో భక్తజనుల మనసు పులకరించింది. నగరం యావత్తూ ఆధ్యాత్మిక వైభవంతో దేదీప్యంగా విరాజిల్లింది.

చిత్తూరు గంగజాతరలో భాగంగా బుధవారం ‘ఓం శక్తి’ నినాదాల మధ్య భక్తులు చేపట్టిన వినూత్న విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారిపై ఉన్న అపారమైన విశ్వాసంతో వందలాది మంది భక్తులు నోటికి, వీపునకు శూలాలు గుచ్చుకుని దీక్షలు నిర్వర్తించారు. కొందరు భక్తులు లారీలకు వేలాడుతూ ఊరేగింపులో పాల్గొనగా.. మరికొందరు ఆటోలు, కార్లను లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. ఈ దృశ్యాలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల విన్యాసాలతో నగర వీధులు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : చిత్తూరు నగరం గంగమ్మ జాతర సందడితో కళకళలాడింది. రెండు రోజులపాటు భక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా సాగిన జాతర బుధవారం అర్థరాత్రి నిమజ్జన మహోత్సవంతో ఘనంగా ముగిసింది. రాష్ట్ర నలుమూలలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో నగరం జనసంద్రంగా మారింది.

అంగరంగ వైభవం

చిత్తూరు నగరంలోని చారిత్రాత్మక నడివీధి గంగజాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మంగళవారం గంగమ్మ తల్లిని నడివీధిలో కొలువుదీర్చి, రెండోరోజు బుధవారం నిమజ్జనానికి తీసుకెళ్లడం ఆనవాయితీ. ఈ సందర్భంగా వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులు గ్రామదేవత పొన్నియమ్మకు విశేష పూజలు నిర్వహించారు. సారె సమర్పణలో భాగంగా ఆలయం నుంచి నడివీధికి భారీ ఊరేగింపుగా బయలుదేరారు. డప్పు వాయిద్యాలు, నయండి మేళాలు, సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు, గజమాలలతో ఊరేగింపు వైభవంగా సాగింది. డప్పు దరువులకు యువకులు ఉత్సాహంగా చిందులేస్తూ సందడి చేశారు. అమ్మవారికి ధర్మకర్త గజమాల సమర్పించడంతో ప్రధాన ఊరేగింపు ప్రారంభమైంది.

అడుగడుగునా నీరాజనాలు

హైరోడ్డు మీదుగా సాగిన అమ్మవారి ఊరేగింపులో భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. గంగమ్మ దర్శనం కోసం రహదారుల వెంట భక్తులు బారులు తీరారు. ఊరేగింపు అర్ధరాత్రి వరకు కొనసాగగా, చివరకు కట్టమంచి చెరువులో అమ్మవారి ప్రతిమను నిమజ్జనం చేశారు. అనంతరం నడివీధిలోని అఖండదీపాన్ని కొండెక్కించడం ద్వారా జాతర ఘట్టం పూర్తయింది.

కట్టుదిట్టంగా బందోబస్తు

అమ్మవారి నిమజ్జనోత్సవానికి పోలీసులు కట్టుదిట్టంగా బందోబస్తు చేపట్టారు. ముందస్తుగా ట్రాఫిక్‌ మళ్లించారు. మండపాలు, ఊరేగింపు మార్గాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిఘా పెట్టారు.

మొక్కు తీర్చుకుంటూ..

నగరమంతా సందడి

కొంగారెడ్డిపల్లి, సంతపేట, గిరింపేట, దొడ్డిపల్లె, మురకంబట్టు, ఒబనపల్లె తదితర ప్రాంతాల్లో సైతం గంగమ్మ ఊరేగింపులు నిర్వహించారు. సంతపేటలో ఓంశక్తి విన్యాసాలు, గిరింపేటలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పలు సేవా సంస్థలు అన్నదానం చేపట్టాయి. మజ్జిగ, చల్లటి పానీయాలు, తాగునీరు పంపిణీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement