19న జిల్లా స్థాయి చెస్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

19న జిల్లా స్థాయి చెస్‌ పోటీలు

May 14 2026 6:51 AM | Updated on May 14 2026 6:51 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : చిత్తూరు నగరంలో ఈ నెల 19వ తేదీన జిల్లా స్థాయి అండర్‌–13 చెస్‌ పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా చెస్‌ అసోషియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ఆర్‌బీ ప్రసాద్‌ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వేపమాను వీధిలోని స్కూల్‌ ఆఫ్‌ చెస్‌లో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికకు రాష్ట్ర స్థాయిలో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుందన్నారు. జిల్లాకు చెందిన క్రీడాకారులకు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి గలవారు ఈ నెల 18వ తేదీ లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా నేరుగా వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని కోరారు. ఇతర వివరాలకు 9849313676, 9000475799 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

పకడ్బందీగా

‘పది’ సప్లిమెంటరీ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో ఈ నెల 25 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు నిర్వహించే పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు. బుధవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలోని 32 కేంద్రాల్లో 4,830 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పది, ఇంటర్‌ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలను ఈ నెల 25వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పరిధిలో పదో తరగతికి 13 కేంద్రాలు కేటాయించగా 917 మంది, ఇంటర్మీడియట్‌కు 10 కేంద్రాల్లో 1,831 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వివరించారు. వేసవి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ మోహన్‌కుమార్‌, డీఈఓ రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement