వరి..ఉరి! | - | Sakshi
Sakshi News home page

వరి..ఉరి!

May 14 2026 6:51 AM | Updated on May 14 2026 6:51 AM

క్వింటా ధర రూ.2 వేలు పలకని వైనం ధాన్యాన్ని కొనుగోలు చేయని వ్యవసాయశాఖ పొలాల వద్దే కొంటున్న పొరుగు రాష్ట్రాల వ్యాపారులు వరి సాగుకు ఎకరానికి రూ.40 వేల వరకు ఖర్చు పెట్టిన పెట్టుబడి పోగా రైతు కష్టం మట్టిపాలు రెండేళ్లుగా జిల్లాలోని వరి రైతుల పరిస్థితి

పలమనేరు: ఏ పంట సాగు చేసినా నికర లాభాలు లేనందున పలువురు రైతులు కనీసం తిండి గింజలకన్నా దక్కుతాయని వరిపంట సాగుపై మొగ్గుచూపారు. పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్‌లో గత డిసెంబరు, జనవరి నెలల్లో నాటిన వరి ఇప్పుడు కోతకు వచ్చింది. రైతులు సుమారు 5 వేల ఎకరాల్లో వరి సన్న రకాలైన బీపీటీ, నర్మద, అమన్‌, ధనిష్ఠ, దొడ్డ రకాలైన జేజేఎల్‌, ఆర్‌ఎన్‌ఆర్‌లాంటి రకాలను సాగు చేశారు. ఇందులో 2 వేల ఎకరాల దాకా ఇప్పటికే నూర్పిళ్లు జరిగాయి. మరో రెండు వేల ఎకరాల్లో వరికోతలు జరగాల్సి ఉంది. వరికోతలు మొదలు కాగానే ఉన్నట్టుండి ధాన్యం ధరలు తగ్గాయి. మొన్నటి దాకా క్వింటా ధర రూ.2,500 దాకా ఉండగా ఇప్పుడు రూ.2 వేల నుంచి రూ.2200 దాకా పలుకుతోంది. నూర్పిడి చేసిన వరి ధాన్యాన్ని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. పంట సాగు చేయడం కంటే భూమిని బీడుగా వదిలేసినా బాగుండేదనే రైతుల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడులూ దక్కని వైనం

ఎకరా పొలానికి వరి విత్తనాలు తెచ్చి నారు మడిని వేయడానికి రూ.2 వేలు. ఆపై బురద మడి దున్నడానికి ట్రాక్టరుకు గంటకు రూ.1,200 చొప్పున ఏడు గంటలకు రూ.9,600, మడి చుట్టూ గెనాలు కొట్టేందుకు రూ.2 వేలు అవుతుంది. నాటేందుకు ముందు పొలంలో రెండు బస్తాల కాంప్లెక్స్‌ ఎరువుకు రూ.2,600 అవుతుంది.ఇక వరినాట్లకు రూ.7 వేలు, ఆపై చెత్త తీసేందుకు రూ.3 వేలు అవుతోంది. ఈ సమయంలో యూరియా కోసం రూ.1200 ఖర్చు పెట్టాలి. పంటకు చీడపీడల నివారణకు పురుగు మందుల కోసం రూ.1000 అవుతుంది. పంటకోతకొచ్చాక యంత్రాల ద్వారా అయితే రూ.11 వేలు పెట్టాల్సిందే. నారుపోసినప్పటి నుంచి ధాన్యం ఇల్లు చేరేందుకు ఎకరా పొలంలో రైతుకు అయ్యే ఖర్చు రూ.40 వేల దాకా అవుతోంది.

బయటి రాష్ట్రాల వ్యాపారులు

స్థానికంగా వరికి ధరలేదని తెలిసి కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరు, చింతామణి, శ్రీనివాసపుర తమిళనాడులోని తిమ్మిరి ప్రాంతానికి చెందిన వ్యాపారులు లారీలతో వచ్చి రైతు పొలాల వద్దే నెమ్ముగా ఉన్న ధాన్యాన్ని సైతం కొని అక్కడే తూకం వేసి గోతాముల్లో నింపి వెంటనే నగదు చెల్లించి తీసుకెళుతున్నారు. వరి ధాన్యాన్ని అడిగే వారులేకపోవడంతో బయటి వ్యాపారులు పొలం వద్దే కొంటున్నారనే సాకుతో తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది.

రైతుకు మిగిలేది శూన్యం

కొనుగోలు చేయని ప్రభుత్వం

గతంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని వ్యవసాయశాఖ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో కొనేవారు. కాని చంద్రబాబు పాలనలో ధాన్యాన్ని కొనకపోగా కనీసం ధర లేకుండా రైతులు నష్టపోతున్నా పట్టించుకునేవారే లేరు. గత రెండు సీజన్లుగా వరి రైతులకు నష్టాలు తప్పడం లేదు.

ఎకరా పొలంలో పంట బాగా పండితే 30 బస్తాలు (బస్తా 80కేజీలు) లెక్కన 24 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పచ్చిగా ఉన్న ధాన్యం ఇప్పుడున్న ధరల మేరకు క్వింటా రూ.2వేలు అయితే రూ.48 వేలు చేతికొస్తుంది. ఇందులో రైతు పెట్టిన పంట పెట్టుబడి రూ.40 వేలు పోతే రైతుకు చివరికి మిగిలేది కేవలం రూ.8 వేలు మాత్రమే. దీంతోపాటు ఐదునెలల పాటు వరిపంట సాగు కోసం ఆరైతు కూలి లెక్కేసుకున్నా గిట్టుబాటు కాని పరిస్థితి.

Advertisement
 
Advertisement
Advertisement