వర్క్‌ఆర్డర్ల వర్రీ!
చిత్‌త్రూు కార్పొరేషన్: ఎప్పటి పనులు అప్పుడు సరిచూసుకుంటే లెక్క సరిపోతుంది. తర్వాత చూస్తాంలే అనే నిర్లక్ష్య ధోరణి వారిని ఇక్కట్లపాల్జేసింది. శాఖ పరంగా జరిగిన అభివృద్ధి పనుల పరంగా సకాలంలో లెక్కచూపకపోవడంతో ఏఈలపై ఏపీఈఆర్సీ ఆదేశాల మేరకు అధికారులు చర్యలకు పూనుకోనున్నారు. దీంతో మిగిలిన ఏఈలు వణికిపోతున్నారు. జిల్లా ట్రాన్స్‌కో పరిధిలో వర్క్‌ఆర్డర్లు క్లోజ్ చేయని ఏఈలను రిలీవ్ చేసి వారి పర్సనల్ అకౌంట్స్ నుంచి మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఏఈలు ఉన్నారు. వీరు బదిలీ, పదోన్నతి వచ్చి డివిజన్, సెక్షన్లు మారిన లెక్కను సరిచేయాల్సిందే. నెలలోపు వీరి పనితీరు మారకపోతే పర్సనల్ అకౌంట్స్ నుంచి మొత్తాన్ని రికవరీ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో 40 మంది ఏఈలు
జిల్లాలో 2021–24వ సంవత్సరం వరకు 40 మంది ఏఈలు 1000 వరకు వర్క్ ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.32.16 కోట్లు ఉంది. అభివృద్ధి పనుల్లో భాగంగా కరెంటు స్తంభాలు, లైన్, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు. విద్యుత్‌శాఖలో ఏ పనిచేయాలన్నా దానికి అనుమతి తీసుకొని వర్క్‌ఆర్డర్లు సిద్ధం చేయాలి. అవి ఆమోదం పొందాక వాటిని స్టోర్స్ లో మెటీరియల్స్ తీసుకుంటారు. తదుపరి క్షేత్రస్థాయిలో పనులు చేస్తారు. చిన్న బోల్టు, నెట్, క్లాంప్, క్రాస్‌హారం, కిలోమీటర్ల లైన్ వరకు వేసిన వాటి లెక్క చూపాల్సిందే. జిల్లాలో కార్వేటినగరం 263 పనులు రూ.3.84 కోట్లు, పైపల్లె సెక్షన్ పరంగా 83 వర్క్‌ఆర్డర్లు రూ.1.37 కోట్లు, గంగవరం 134 వర్క్‌ఆర్డర్లు రూ.1.41 కోట్లు, యాదమరి 61 వర్క్‌ఆర్డర్లు రూ.69 లక్షలు, పలమనేరు 354 పనులు రూ.25 లక్షలు, పరంగా ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నారు. వీరితో మిగిలిన వారు ఆ మొత్తం చెల్లించాల్సి ఉంది.
నిలిచిపోనున్న నిధులు
ట్రాన్స్‌కో పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పరంగా చేసిన పనులు వివరాలు లెక్క చూపాలి. అప్పుడు క్షేత్రస్థాయిలో జరిగిన పనులు గురించి వివరాలు తెలుస్తోంది. వాటిని క్లోజ్ చేయకపోవడంతో అలాగే పెండింగ్ ఉంటుంది. దీంతో అభివృద్ధి పనులకు నిధులు సైతం ఆగిపోనున్నాయి. దీంతో అవసరాలకు తగిన మెటీరియల్స్ రాక సకాలంలో పనులు పూర్తికావడం లేదు. పనులు సకాలంలో పూర్తి చేసి ఉంటే నిధులు, మెటీరియల్స్ పెరిగి అభివృద్ధి మరింతగా జరిగి ఉండేది.


