● కాగితాలకే పరిమితమైన అవగాహన సదస్సులు
చిత్తూరు కలెక్టరేట్ : జగగణన (సెన్సస్) ప్రక్రియ చిత్తూరు జిల్లాలో జరుగుతోందా.. అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రజలే స్వయంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని ప్రస్తుతం ప్రవేశపెట్టినప్పటికీ, అది క్షేత్ర స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అవుతోంది. క్షేత్ర స్థాయిలో ఈ ప్రక్రియ పై అవగాహన కల్పించాల్సిన క్షేత్రస్థాయి అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. క్రీడాకారులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలతో అవగాహన కల్పించాలన్న నిబంధన కేవలం కాగితాలకే పరిమితమైంది. ఒకవైపు సర్వర్లు మొరాయింపు.. మరోవైపు ఓటీపీలు రాక ఇబ్బందులతో సతమతమవ్వాల్సి వస్తోంది. వాటిని పరిష్కరించేందుకు ఒక టోల్ ఫ్రీ నంబర్ సైతం అందుబాటులో లేకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. 33 రకాల వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో భద్రపరచడం పై సామాన్యుల్లో ఉన్న భయాందోళనలను తొలగించే ప్రయత్నం ఏ కోశానా కనిపించడం లేదు. మే ఒకటి నుంచి సిబ్బంది తనిఖీలకు వస్తారని చెబుతున్నా, అసలైన సిబ్బందిని గుర్తించడం ఎలాగో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు.
ప్రచార ఆర్భాటమే..
జిల్లా వ్యాప్తంగా జనగణనపై కనీస అవగాహన కల్పించడంలో క్షేత్ర స్థాయి యంత్రాంగం విఫలమైంది. గత కొద్ది రోజులుగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నా, ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదు. సామాన్య ప్రజలకు ఈ ఆన్‌లైన్ విధానంపై సరైన అవగాహన లేక ఎన్యుమరేటర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యే సమయంలో ఓటీపీలు రాకపోవడం, మ్యాపింగ్‌లో ఇంటి లొకేషన్ తప్పుగా చూపడం వంటి అంశాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. కొందరు గోప్యత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకుందామన్నా ఎవరూ అందుబాటులో లేరని జిల్లా వాసులు వాపోతున్నారు.
భద్రతపై ఆందోళన
మే 1 నుంచి సిబ్బంది ఇంటింటికీ వస్తారని చెబుతున్నప్పటికీ, గతంలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా ప్రజలు అపరిచితులను అనుమతించడానికి భయపడుతున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల ని చెబుతున్నా, అసలు ఆ గుర్తింపు కార్డులు అసలైనవో కాదో తేల్చుకోవడం సామాన్యులకు కష్టంగా మారింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది అలసత్వం వల్ల జనగణన ప్రక్రియ జిల్లాలో అలసత్వంగా సాగుతోంది. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం స్పందించి క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించకపోతే, గణాంకాల సేకరణ అసంపూర్తిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.


