కార్వేటినగరం: సీఎం చంద్రబాబునాయుడు కులాల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తున్నారని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులకు గౌరవం, హోదా వచ్చింది వైఎస్ రాకశేఖరరెడ్డి ప్రభుత్వంలోనేనన్నారు. ఆయన కుమారుడు, మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రెండడుగులు ముందుకేసి దళితులకు సముచిత స్థానం కల్పించారని కొనియాడారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నవరత్నాల పథకాలను తీసుకొచ్చి అమలు చేశారని తెలిపారు. నేడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అన్నదమ్ములుగా కలిసి ఉన్న మాల, మాదిగలను విభజించి వారి మధ్య చిచ్చుపెట్టి వేడుక చూస్తున్నారని తెలిపారు. దళితులంటే చంద్రబాబుకు చులకన అని, గతంలో ఎన్నో బహిరంగ సమావేశాల్లో దళితులను నీచంగా మాట్లాడిన రోజులు ఉన్నాయని గుర్తుచేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎస్సీ, ఎస్టీలను అణదొక్కడమే లక్ష్యంగా పనిచేస్తారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అగ్రవర్ణాలకు చెందిన వారి కనుసన్నల్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్నట్లు విమర్శలు వాస్తున్నాయని చెప్పారు. ఎస్సీ వర్గాలపై జరుగుతున్న అన్యాయం, సామాజిక అసమానతలపై దళిత ఎమ్మెల్యేలు చంద్రబాబు వైఖరిపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పేదల సమస్యలను విస్మరించి పెత్తందారుల కోసమే ఆరాటపడుతున్నాడని విమర్శించారు. ప్రశ్నించిన వారి గొంతుకను అణచి వేయడానికి పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు నమోదు చేసి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, ఇలాంటి రాజకీయ నాయకులకు చరిత్ర ఉండబోదన్నారు.
నేడు వైఎస్సార్‌సీపీ నిరసన
యాదమరి: పంచాయతీరాజ్‌శాఖలో గత డిసెంబర్ నుంచి ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు కోనాపల్లి మనోహర్ చెప్పారు. ఆధివారం ఆయన మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కూటమి ప్రభు త్వం నిర్లక్ష్యం వల్ల ఉపాధి కూలీలకు వేతనాలు అందక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. సుమారు రూ.1,059 కోట్ల మేరకు ఉపాధి నిధులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. వెంటనే ఆ బకాయిలను చెల్లించి కూలీల కష్టా లు తీర్చాలని డిమాండ్ చేశారు.


