తిరుమల: తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న పద్మావతి పరిణయోత్సవాలు రెండో రోజు వైభవంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి, వెంట వేర్వేరు బంగారు తిరుచ్చీలపై శ్రీదేవి, భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. మొదటిరోజు మాదిరే స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరులు భాగవతార్ హరికథ గానం భక్తులను అలరించింది. ఆ తరువాత శ్రీవారు దేవేరులతో పల్లకీనెక్కి తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయలోకి ప్రవేశం చేశారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.


