ముత్యపు పందిరిపై మురిపాల రేడు | - | Sakshi
Sakshi News home page

ముత్యపు పందిరిపై మురిపాల రేడు

Apr 27 2026 7:42 AM | Updated on Apr 27 2026 7:42 AM

– సింహ వాహనంపై యోగశ్రీనివాసమూర్తి

అవతారంలో స్వామివారు విహారం

గంగవరం: మండలంలో కీలపట్ల శ్రీకోనేటిరాయస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉదయం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనాలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. అంతకు ముందు వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి తోమాలసేవ, అర్చన, చందన పుష్ప తాంబూలాలతో అభిషేకించి ఘంటానాథం తరువాత నైవేద్యం సమర్పించారు. ఆ తరువాత శ్రీవారిని యోగ శ్రీనివాసమూర్తి అవతారంలో అలంకరించి సింహ వాహనంపై కొలువుదీర్చి మాడ వీధుల్లో ఊరేగించారు.

శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం

సింహ వాహన సేవ అనంతరం ఉభయదేవేరులు సహా శ్రీవారి ఉత్సవమూర్తులను తిరిగి ఆస్థాన మండపానికి తరలించి తులసి మాలలతో అలంకరించి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉయ్యాలపై కొలువుదీరి అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, అన్నమయ్య సంకీర్తనల నడుమ ఊంజల్‌ సేవ చేపట్టారు. కంకణ భట్టార్‌ శ్రీకాంత్‌ఆచార్యులు అర్చక బృందం ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆగమశాస్త్ర ప్రకారంగా జరుగుతున్నాయి.

ముత్యపు పందిరిపై శ్రీకృష్ణ అవతారంలో..

బ్రహ్మోత్సవాల్లో అన్ని కై ంకర్యాలు ముగిసిన తరువాత రాత్రి ముగ్ధమనోహర స్వరూపుడైన స్వామివారు శ్రీకృష్ణ భగవానుడి అవతారంలో రుక్మిణీ, సత్యభామతో కలిసి ముత్యపు పందిరి వాహనంలో కొలువుదీరి కీలపట్ల పుర వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. కాగా నాల్గవ రోజు సోమవారం ఉదయం శ్రీవారు కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనాల్లో విహరించనున్న ట్టు ఆలయ అధికారులు తెలిపారు. స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్‌ మునిబాల, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహనరమణ, అర్చకులు ఏకే. నరసింహాచార్యులు, దేవరాజాచార్యులు, శ్రీహర్షదీక్షితులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement