చిత్తూరు కలెక్టరేట్ : గత ఏడాది బదిలీలు పొందిన టీచర్లను తక్షణమే రిలీవ్ చేయాలని వైఎస్సార్‌టీఏ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు రెడ్డిశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బదిలీలు పొందిన టీచర్లకు విద్యాసంవత్సరం పూర్తయినా నిరీక్షణ తప్పడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం టీచర్ల బదిలీ చట్టం తీసుకొచ్చినప్పటికీ ఆచరణలో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. విద్యాసంవత్సరం పూర్తయినప్పటికీ రిలీవర్లు లేరనే సాకుతో రాష్ట్ర వ్యాప్తంగా 954 మంది టీచర్లను ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగించడం దారుణమన్నారు. బదిలీ ఉత్తర్వులు చేతిలో ఉన్నా రిలీవ్ చేయకపోవడంతో ఉపాధ్యాయుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మండిపడ్డారు. కొత్త ప్రాంతంలో నివాసం ఎక్కడ ఉండాలో, పిల్లల చదువుల పరిస్థితి ఏమిటో తెలియక ఉపాధ్యాయులు సందిగ్ధంలో ఉన్నారని వాపోయారు. బదిలీ చట్టాన్ని తెచ్చిన విద్యాశాఖ మంత్రి ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రిలీవ్ చేయడానికి అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, తక్షణమే రిలీవింగ్ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉద్యోగ మేళాలో 256 మంది ఎంపిక
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ మేళాలో 256 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటాచలపతి తెలిపారు. శనివారం ఆ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించారు. వివిధ బహుళజాతి కంపెనీలు ఉద్యోగ మేళాలో పాల్గొన్నాయని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి 430 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. ప్రతిభ చాటిన 256 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. అనంతరం ఎంపికై న విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో చైర్మన్ రంగనాథం, విద్యాసలహాదారు నారాయణ, సీఈ నాగేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యా బోధనే లక్ష్యం
– ఎన్‌ఎస్‌యూ వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి
తిరుపతి సిటీ: ఉన్నత లక్ష్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే జాతీయ సంస్కృత వర్సిటీ ప్రధాన ధ్యేయమని వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. శనివారం ఆయన వర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్‌ఎస్‌యూలో పాక్‌శాసీ్త్ర(ఇంటర్మీడియట్), యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అడ్మిషన్ సెల్‌ను నేరుగా లేదా ఫోన్ నంబర్ 7382595500లో సంప్రదించాలని కోరారు. అనంతరం 2026–27 ప్రవేశాల నోటిఫికేషన్ బ్రోచర్‌ను విడుదల చేశారు. వచ్చేనెల 4వ తేదీ నుంచి వర్సిటీలో యోగా సమ్మర్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామని, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు వర్సిటీలోని యోగా విభాగంలో సంప్రదించి నిర్ధేశించిన ఫీజు చెల్లించి అడ్మిషన్లు పొందాలన్నారు.
వర్సిటీలో స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సైన్స్
ఎన్‌ఎస్‌యూలో నూతనంగా స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ ప్రారంభిస్తున్నట్లు వీసీ తెలిపారు. సంస్కృత విద్యతోపాటు ఆధునిక కోర్సులు, కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్, హిస్టరీ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, లాంగ్వేజ్ టెక్నాలజీ వంటి యూజీ, పీజీ కోర్సులను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.


