చిత్తూరు కలెక్టరేట్ : డీఈఈ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు. శనివారం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 26తో దరఖాస్తులకు సమయం ముగుస్తుంది. అయితే ఏప్రిల్ 30వ తేదీ వరకు మరో ఐదు రోజులు సమయం పొడిగించారు. జిల్లాలో ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ అదనపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా రు. ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.
రేపు నిండ్రలో పీజీఆర్‌ఎస్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27న నగరి నియోజకవర్గం నిండ్ర ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
వార్డుల పునర్విభజన గడువు పెంపు
చిత్తూరు అర్బన్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య పెంచడానికి చేపట్టిన పున ర్విభజన కార్యక్రమ గడువును పెంచుతూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదేశాలు అందాయి. వాస్తవానికి వార్డుల సంఖ్య పెంచు తూ, కొత్త వార్డుల జాబితాను ఆదివారం ప్రచురించి.. ఆపై అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితా రూపొందించాల్సి ఉంది. కానీ ఈ గడువును వచ్చేనెల 17వ తేదీకి పొడిగిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది.
పోలీసు తనిఖీలు
చిత్తూరు అర్బన్: ముందస్తు నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. నేరాలు జరగకమునుపే కార్డెన్‌సెర్చ్ పేరిట జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి.. ప్రజల్లో అవగాహన పెంచుతున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపా రు. చోరీలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను నియంత్రిండానికి ప్రజలు సహకరించాలని కోరారు.


