– హిటాచీ, లారీ స్వాధీనం
– నిర్వాహకులు పరారీ
కుప్పంరూరల్ : రెండు అక్రమ క్వారీలను సీజ్‌చేసి అందులో పనులు చేపడుతున్న ఒక హిటాచీ, లారీని స్వాధీనం చేసుకున్నట్లు కుప్పం డీఎస్పీ పార్థసారధి చెప్పారు. శనివారం ఉదయం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీజ్ చేసిన క్వారీల వివరాలు వెల్లడించారు. కుప్పం మండలం, గుట్టపల్లి వద్ద ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్వారీలపై పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు చెప్పారు. దాడులు సందర్భంగా క్వారీలు కార్యకలాపాలు జరుగుతున్నాయని, పోలీసులను చూసి నిర్వాహకులు పారిపోయినట్లు చెప్పారు. వ్యక్తులు పారిపోగా.. అక్కడే వదిలివెళ్లిపోయినా హిటాచీ, లారీను స్వాధీనం చేసుకుని మైనింగ్ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. ఎవరైనా అక్రమ క్వారీలు, నాటు సారా తయారీ, గంజాయి విక్రయాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని, అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ముఖ్యంగా మహిళలను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రశాంత కుప్పంలో అక్రమ రవాణా, కార్యకలాపాలకు తావులేదని, ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని చెప్పారు. సమావేశంలో అర్బన్ సీఐ శంకరయ్య తదితరులు ఉన్నారు.


