తిరుపతి కల్చరల్: చర్మ మార్పిడి సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా ఎస్వీ మెడికల్ కళాశాలలో చేప చర్మంతో కాలిన గాయాలకు వైద్య చికిత్స చేసే విధానంలో పరిశోధన చేస్తున్నట్లు ఎస్వీ వైద్య కళాశాల బహుళ పరిశోధన సంస్థ నోడల్ అధికారి డాక్టర్ ఏఎస్.కిరీటి తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలిన చర్మాన్ని పునరుత్పత్తి చేసే వైద్యం చాలా ఖర్చుతో కూడుకోవడంతో అది అందుబాటులో లేక ఎంతో మంది వైద్యానికి దూరమవుతున్నారని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రముఖ శస్త్ర చికిత్స వైద్యరాలు డాక్టర్ రోజారమణి పరిశోధన చేపట్టారన్నారు. భారతీయ చరిత్రలో మన పూర్వీకులు 2 వేల ఏళ్ల కిందటే చేప చర్మంతో ఈ వైద్యం మొదలు పెట్టారని, అయితే అది కనుమరుగైందని తెలిపారు. దీనిని ఆధునాతన పరిశోధన వైద్య పద్ధతులతో పరిశోధనలు చేసి, దేశవాళి చేప చర్మంతో చర్మ మార్పిడి పద్ధతులను పరిశోధించి రోగికి అందించాలనే ఉద్దేశంతో ఎస్వీ మెడికల్ కళాశాల, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, పశువైద్యశాల, పద్మావతి మహిళా వర్సిటీ సంయుక్తంగా ఈ పరిశోధనలు చేపట్టడం జరిగిందన్నారు. జాతీయ వైద్య పరిశోధనా సంస్థ నుంచి ఈ పరిశోధనకు అనుమతి లభించడంతో ఒన్ హెల్త్ కార్యక్రమం కింద పరిశోధనలు దిగ్విజయంగా చేపడుతున్నామని తెలిపారు. మహిళా వర్సిటీ ఫార్మసీ విభాగం డాక్టర్ విద్యావతి ఈ చేప చర్మాన్ని, డ్రాప్ట్స్ చర్మమని కాలిన గాయాలపై ఉపయోగించేలా తయారు చేశారని తెలిపారు. ఈ చేప చర్మంపై చేసిన పరిశోధనలను ఘనంగా పురోగతి చెందుతున్నాయని, ఎలుకలపై పరిశోధించడానికి సంయుక్తంగా అన్ని విధాల సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ రోజా రమణి, పరిశోధకులు వి.మధుసూదన్, డాక్టర్ ఆర్‌వీ.సురేష్‌కుమార్, ఎస్వీ వైద్య కళాశాల పీఆర్వో వీర కిరణ్ పాల్గొన్నారు.


