న్యూస్‌రీల్
నిన్న సత్యవేడు ఎమ్మెల్యే ఆవేదన నేడు గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే ఆందోళన ఎస్సీలనే తొక్కేస్తున్నారంటూ విచారం ఓట్లు, కోట్లు కోసమే ఎస్సీలను వాడుకుంటున్నారన్న థామస్ వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కారణమా?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లా రాజకీయాల్లో గంగాధరనెల్లూరు నియోజకవర్గం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఇన్నాళ్లు ముసుగులో సాగుతున్న విభేదాలు ఇప్పుడు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. కూటమి నేతలకు సవాలు విసురుతున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఎస్సీ వర్గాలపై జరుగుతున్న అన్యాయం, సామాజిక అసమానతలపై ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇది కేవలం వ్యక్తిగత అసంతృప్తే కాదు.. నియోజకవర్గంలో జరుగుతున్న అధికార పోరు, సామాజిక సమీకరణాలు, రాజకీయ ఆధిపత్యం కలిసిన సంక్లిష్ట పరిణామంగా మారిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న విభేదాలను బహిరంగ వేదికపైకి తీసుకొచ్చిన ఎమ్మెల్యే థామస్, కూటమి నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ‘ఎస్సీలను ఓట్ల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కాకుండా, టీడీపీలో సామాజిక అసమానతలపై గట్టిగా వినిపించిన స్వరం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
టీడీపీలో ఒకే సామాజిక వర్గానికి పెత్తనం?
జీడీనెల్లూరు నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార, పరిపాలన వ్యవహారాల్లో అదే వర్గానికి చెందిన నేతల ప్రభావం పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఇతర వర్గాలు, ముఖ్యంగా బడుగు వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ అసంతృప్తినే ఎమ్మెల్యే థామస్ ఇప్పుడు బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారని భావిస్తున్నారు.
పాలసముద్రం నేత ఎంట్రీతో
మారిన సమీకరణాలు
పాలసముద్రానికి చెందిన ఓ బడా నేతకు నియోజకవర్గ పగ్గాలు అప్పగించారన్న ప్రచారం రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. స్థానికంగా ఎన్నికై న ప్రజాప్రతినిధిని పక్కన పెట్టి బయట నాయకుడికి ప్రాధాన్యం ఇవ్వడం అసహనానికి దారి తీసిందని తెలుస్తోంది. అది కూడా ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా అతనికి పదవి ఇవ్వడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిర్ణయాల్లో తన పాత్రను తగ్గిస్తున్నారన్న భావనతోనే థామస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.
కూటమిలో ఎస్సీ ఎమ్మెల్యేలే టార్గెట్టా?
‘పార్టీలో ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఒకే విధమైన ప్రయత్నం జరుగుతోంది’ అన్న థామ స్ వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. ఇది కేవలం వ్యక్తిగత రాజకీయ పోరు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్సీ ఎమ్మెల్యేలను అణగాదొక్కడంలో భాగంగానే కొందరు కుట్రతో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను ట్రాప్ చేసి ఇరికించారని, ఆఖరుకి ఆయన్ని సస్పెండ్ చేసే స్థాయికి తీసుకొచ్చారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తాను ఇతర కులాలకు చెందిన ఎమ్మెల్యేని అయితే ఇబ్బంది ఉండేది కాదని రాష్ట్రంలోనే ఎమ్మెల్యేగా మొదటి ర్యాంకు ఇచ్చే వారిని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పార్టీ గెలుపునకు ఎస్సీల ఓట్లు అవసరం, పదవులు అనుభవించడానికి మాత్రం పనికిరామ అన్నట్లు చురకలు అంటించారు. టీడీపీలో ఎస్సీ నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
టార్గెట్ ఎస్సీలే!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ ఎస్సీ
ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైంది. నిన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, నేడు గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే థామస్ చేసిన
సంచలన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఆ సామాజిక వర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సత్యవేడు,
గంగాధరనెల్లూరు, పూతలపట్టు, సూళ్లూరుపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు స్థానాలు. ఆ నియోజకవర్గాల్లో గెలుపొందిన ఒక్కరు తప్ప మిగిలిన కూటమి ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దలు, ఆ పార్టీ నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
బానిసలుగా బతకాలా?
ఎస్సీ వర్గాల పరిస్థితిపై మాట్లాడిన ఎమ్మెల్యే థామస్ ‘ఎస్సీలు బానిసలుగా బతకాలా?’ అంటూ ఆయన వ్యక్తం చేసిన ఆవేదన ఆ సామాజికవర్గంలో చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంపై నేరుగా విమర్శలుగా మారడమే కాకుండా, సామాజిక న్యాయం అంశాన్ని తెరపైకి తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో తాను ఉన్నంత వరకు గంగాధరనెల్లూరులో వేరొకరు రారు, రానివ్వననే సంకేతాలను ఇచ్చారు. ఒకే రోజు ఇద్దరు టీడీపీ ఎస్సీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ నేతలు, అధికారుల తీరుపై చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
టీడీపీ శ్రేణులు చెబుతున్నదేమిటంటే?
నియోజకవర్గంలో తనకు తెలియకుండా.. తన అభిప్రాయం తీసుకోకుండా రాష్ట్ర స్థాయి పదవులు ఇవ్వడంపై ఎమ్మెల్యే థామస్ అమరావతికి వెళ్లి ముఖ్యనేతలను కలిశారని, అక్కడ వారు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకుంటున్నారు. అమరావతి నుంచి వచ్చిన థామస్ అసంతృప్తిగా ఉన్న నాయకులు, కార్యకర్తలతో సమావేశానికి పిలిచినా ఓ సామాజిక వర్గం నేతలు రాలేదని వెల్లడించారు. ఎమ్మెల్యే ఏ కార్యక్రమం చేపట్టినా ఓ సామాజిక వర్గం నేతలు హాజరు కాకపోవడం, స్థానికులను కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘ఓ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలు’ ఏ కార్యక్రమానికి రాకపోవడం, ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు వారు రాకపోవడం, ఎమ్మెల్యేను అడుగడుగునా అవమానిస్తున్నట్లు స్థానిక శ్రేణులు చెప్తున్నాయి. అందుకే ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.


