– జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగ శశిభూషణ్‌రెడ్డి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందివ్వడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగ శశిభూషణ్‌రెడ్డి ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన వైద్యాధికారులతో సమీక్షించారు. జనాభా నిర్వహణపై క్షేత్రస్థాయి సిబ్బందికి వారం పాటు ప్రత్యేక శిక్షణ ఉంటుందన్నారు. ప్రస్తుతం జనాభా పునరుత్పత్తి రేటు 1.5గా ఉండటంతో దానిని పెంచే దిశగా అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వడదెబ్బలు, వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సచివాలయాలు, హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు, పీహెచ్‌సీలు, నిర్మాణ స్థలాలు, పనిస్థలాల్లో ఓఆర్‌ఎస్ డిమాండ్ స్టేషన్లు ఏర్పాటు చేసి ప్రజలకు చల్లని నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి అందుబాటులో ఉంచాలన్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ యార్డుల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఓఆర్‌ఎస్ పంపిణీ చేయాలన్నారు. అనుమానిత వడదెబ్బ కేసులు గుర్తించిన వెంటనే 108లో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇక సంజీవిని ప్రాజెక్టును, చిత్తూరు జిల్లాను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌తో ఉచితంగా, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తామన్నారు. సమావేశంలో డిఐఓ డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ గిరి, డాక్టర్ అనూష, డాక్టర్ నవీన్, జార్జ్ తదితరులు పాల్గొన్నారు.


