కృత్రిమ ఇసుక దందాలో.. నవ వసంతం! | - | Sakshi
Sakshi News home page

కృత్రిమ ఇసుక దందాలో.. నవ వసంతం!

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

● మొగిలి ప్రాంతం నుంచి మట్టి తీసుకొస్తున్న వైనం ● ఆపై కృత్రిమ ఇసుక తయారు చేసి టిప్పర్లలో తమిళనాడు, కర్ణాటకకు తరలింపు ● రూ.కోట్లకు పడగలెత్తుతున్న బంగారుపాళ్యంకు చెందిన ఓ టీడీపీ నేత

బంగారుపాళ్యం తహసీల్దార్‌ కార్యాలయం పక్కనే కృత్రిమ ఇసుక తయారీ

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తమ్ముళ్లు మట్టి నుంచి మనీని ఈజీగా తీసేస్తున్నారు. కృత్రిమ ఇసుక తయారీలో కోట్లు కొల్లగొడుతున్నారు. ఓ టీడీపీ నేత ఈ దందాలో నవ ‘వసంతంగా’ వర్ధిల్లుతున్నాడు. మొగిలి ప్రాంతంలో నుంచి మట్టిని తీసుకొచ్చి తహసీల్దార్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నాడు. ఆ తర్వాత టిప్పర్లలో ఇసుకను తమిళనాడు, కర్ణాటకకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నాడు. గత కొన్నాళ్లుగా నడుస్తున్న ఈ దందా ఆలస్యంగా పలువురి కంట పడింది. రోజూ వందల టన్నుల మట్టిని తరలిస్తూ, భారీ యంత్రాలతో ఇసుక తయారు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అయినా ఏ ఒక్కరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

ఎందుకో మౌనం?

ఇంత పెద్ద స్థాయిలో కృత్రిక ఇసుక దందా సాగుతున్నా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. తహసీల్దార్‌ కార్యాలయ సమీపంలోనే ఈ దందా సాగుతుండగా, అధికారులు తెలియనట్టుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీలో నవ ‘వసంతం’గా పేరు పొందిన ఓ నేత ఈ దందాలో ఆరితేరాడని, మామూళ్ల మత్తులో అధికారులు సైతం జోగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కృత్రిమ ఇసుక తయారీ వెనుక ఒక బడా నేత ప్రమేయం ఉందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఆ నేత ఆశీస్సులతోనే ఈ అక్రమాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

ముప్పు తప్పదు

మొగిలి ప్రాంతంలో మట్టిని అధికంగా తవ్వడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడం, వ్యవసాయ భూము లు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా, కృత్రిమ ఇసుక తయారీలో ఉపయోగించే యంత్రాల వల్ల ధూళి, కాలుష్యం పెరిగి, సమీప గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ అక్రమ ఇసుక దందాపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే ఈ మాఫియాను అరికట్టాలని కోరుతున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

టిప్పర్లల్లో ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్న అజ్ఞాతవాసి

కృత్రిమ ఇసుక తయారీ చేస్తున్న దృశ్యం

టిప్పర్ల రద్దీ

తయారైన ఇసుకను పగలురాత్రి తేడా లేకుండా టిప్పర్లలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. రాత్రి వేళల్లో రోడ్లపై టిప్పర్ల రాకపోకలు విపరీతంగా పెరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. రోజుకు 30 నుంచి 40 టిప్పర్ల ఇసుక పొరుగు రాష్ట్రాలకు తరలుతోందని ఆరోపిస్తున్నారు. అక్కడ ఒక టిప్పర్‌ ఇసుక రూ.లక్ష వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే నెలవారీ సంపాదన రూ.కోట్లల్లోనే ఉందని తెలుస్తోంది. వచ్చిన ఆదాయంలో కొంత మంది బడా నేతలు, పలు శాఖ అధికారులకు మామూళ్లు ముడుతున్నాయనే ఆరోపణలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement