చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారు లు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమో దు చేసుకోనున్నట్టు వెల్లడించారు.
సీనియారిటీ
జాబితా విడుదల
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న అన్ని కేడర్ల టీచర్ల తుది సీనియారిటీ జాబితాలు విడుదల చేసినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. గురవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే మార్చి 1, 15 తేదీల్లో రెండు విడతలుగా విడుదల చేసిన ప్రాథమిక జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించినట్లు తెలిపారు. సంబంధిత ఎంఈవో, డీవైఈవోలకు మెయిల్ పంపినట్లు చెప్పారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపడుతుండడంతో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ఈ సీనియారిటీ జాబితా మేరకే జరుగుతుందన్నారు. టీచర్లు తుది జాబితాలో తమ వివరాలను సరిచూసుకుని ఏప్రిల్ 27లోపు ఎంఈవోలకు డిక్లరేషన్ ఫారాలను సమర్పించాలన్నా రు. డేటాలో, సీనియారిటీ జాబితాలో పేర్లు లేని పక్షంలో తగిన ఆధారాలతో ఈ నెల 25వ తేదీలోపు చిత్తూరు డీఈవో కార్యాలయంలో తెలియజేయాలన్నారు. ఎంఈవోలు సేకరించే డిక్లరేషన్‌లను ఈ నెల 30లోపు డీఈవో కార్యాలయాలనికి పంపాలన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరుగుతున్న ప్రక్రియలో టీచర్లు తమ వివరాలను ధృవీకరించుకోవాలని డీఈవో సూచించారు.
26న ఓపెన్ చెస్
చాంపియన్‌షిప్ పోటీలు
– చిత్తూరు జిల్లా క్రీడాకారులకు మాత్రమే అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని బృందావన్ పాఠశాలలో ఈ నెల 26న ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఆర్‌బీ ప్రసాద్ తెలిపారు. గురువారం స్థానిక వేపమాను వీధిలోని స్కూల్ ఆఫ్ చెస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిత్తూరు చెస్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–11 ఓపెన్ చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల వారు ఈనెల 26వ తేదీలోపు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీచెస్.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ పోటీలు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. క్రీడాకారులు చెస్‌బోర్డు, చెస్ క్లాక్ వెంట తెచ్చుకోవాలన్నారు. ఇందులో గెలుపొందే క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లా క్రీడాకారులు మాత్రమే అర్హులన్నారు. ఇతర వివరాలకు 9849313676, 9000475799 నెంబర్‌లలో సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు సునిల్‌కుమార్, రాధాకృష్ణ పాల్గొన్నారు.


