సాక్షి, టాస్క్‌ఫోర్స్: జిల్లాలోని జీడీనెల్లూరు నియోజకవర్గంలో అక్రమ క్వారీ మాఫియా బరితెగిస్తోంది. ‘నాకు ఎమ్మెల్యే అండ ఉంది... ఎక్కడికై నా రాళ్లు తరలిస్తా..’ అంటూ చెలరేగిపోతోంది. అధికారులను సైతం ధిక్కరించే ఆ అపరిచితుడి వ్యవహారం ఇప్పుడు సంచలంగా మారింది. అనుమతులు లేని క్వారీలనే టార్గెట్‌గా చేసుకుని రాళ్లదోపిడీ సాగుతున్నా ఏ ఒక్క అధికారీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
రాళ్ల దోపిడీ
జిల్లాలో ఎక్కడ అనుమతి లేని క్వారీ ఉందో అక్కడే అజ్ఞాత వ్యక్తి వాలిపోతాడు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న క్వారీల నుంచి గ్రానైట్ రాళ్లను భారీగా తరలిస్తూ పబ్బం గడుపుకుంటాడు. ఎవరూ అడగరు అన్న ధైర్యంతోనే ఈ దందా సాగిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే పేరు చెప్పి
నాకు ఎమ్మెల్యే అండ ఉంది.. ఎవ్వరూ ఏమీ చేయలేరు.. అంటూ అధికారులను బెదిరించడం ఇతని స్టైల్. ఎవరైనా ప్రశ్నిస్తే రాజకీయ మద్దతు ఉందని చెప్పి అధికారులను వెనక్కి తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం.
అడ్డుకున్నా ఆగడు
ఆయన చేస్తున్న అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులను బెదిరించి.. వాహనాలను ముందుకు తీసుకెళ్లడం పరిపాటి.ఽ ఆపగలిగితే ఆపండి అన్న ధోరణితో వ్యవహరిస్తూ, అధికారులకు ఒక సవాల్ విసురుతుంటాడు. కొంతమంది అధికారులు కూడా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి.
పోలీసుల వలలో గ్రానైట్ లారీ
వెదురుకుప్పం మండలం, పచ్చికాపల్లం నుంచి వయా పెనుమూరు మార్గంలో చిత్తూరు వైపుగా అక్రమ గ్రానైట్ తరలిస్తున్న లారీని ఇటీవల పెనుమూరు పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు. అనంతరం చేపట్టిన తనిఖీల్లో సరైన అనుమతులు లేవని తేలింది. దీంతో లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది.
మాఫియా వెనుక ఉన్న పెద్దలెవరు?
ఈ అక్రమ వ్యవహారాల వెనుక ఉన్న పెద్దలెవరు? ఇంతటికీ గ్రానైట్ అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తి ఎవరు..? తన వెనుక ఉన్నది రాజకీయ నాయకుడా..? లేక ప్రభుత్వ ఉన్నతాధికారులా..? అన్న ప్రశ్న స్థానికంగా తలెత్తుతోంది. రాజకీయ అండదండలు లేకుండా ఇంత బహిరంగంగా దోపిడీకి పాల్పడడం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తున్నాయి,
హల్‌చల్
రిజిస్ట్రేషన్ వివరాలు స్పష్టంగా లేని ఫర్‌ూచ్యనర్ వాహనానికి బ్లాక్ స్టికరు వేసుకుని నగరంలో యథేచ్ఛగా తిరుగుతాడు. ఈ వాహనాన్ని ఉపయోగించి క్వారీల వద్ద పర్యవేక్షణ చేస్తాడు. ఆపై రాళ్ల తరలింపును సాగిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చర్యలు తీసుకుంటారా?
గ్రానైట్ లారీ పట్టుబడడం ఒక్కటే సరిపోదని.. ఈ బడా మాఫియాకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ తంతు గత 18 నెలలుగా జిల్లాలో కొనసాగుతోందని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్ లేని వాహనాల్లో తిరుగుతూ అనుమతులు లేని క్వారీలను ఎంపిక చేసుకుని ప్రకృతి సంపదను దోచుకు వెళ్తున్న వ్యక్తిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.


