వెంకటకృష్ణపాళెంలో ఐదుగురి మృతి | - | Sakshi
Sakshi News home page

వెంకటకృష్ణపాళెంలో ఐదుగురి మృతి

Apr 23 2026 8:00 AM | Updated on Apr 23 2026 8:00 AM

● అత్త, కోడలు దారుణ హత్య ● పిల్లలిద్దరినీ రైలుకింద తోసి తనువు చాలించిన తండ్రి ● నారాయణవనం మండలంలో కలకలం

● అత్త, కోడలు దారుణ హత్య ● పిల్లలిద్దరినీ రైలుకింద తోసి తనువు చాలించిన తండ్రి ● నారాయణవనం మండలంలో కలకలం

నారాయణవనం: మండలంలోని వెంకటకృష్ణపాళెం గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హత్యకు గురికాగా.. మరో ఇద్దరు పిల్లలతో సహా కుటుంబ యజమాని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ‘పంచ’ప్రాణాల మృతికి గల కారణాలు తెలియరాలేదు. భార్యాభర్తల కాల్‌డేటా ఆధారంగా వివరాలు కనుక్కునేందుకు పోలీసులు విశ్వప్రయతాలు చేస్తున్నారు.

ప్రేమ వివాహం చేసుకుని..

వెంకటకృష్ణపాళేనికి చెందిన మోహన్‌(45) రైల్వేకోడూరుకు చెందిన హరిత(33)ను 16 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి హిమని(15), కౌశిక్‌(12) పిల్లలున్నారు. హరిత స్థానికంగా టైలరింగ్‌తోపాటు బ్యూటీపార్లర్‌ నడుపుతోంది. మోహన్‌ నెలన్నర క్రితమే స్టీలు, సిమెంట్‌ దుకాణాన్ని ప్రారంభించాడు. ఇద్దరూ రెండు చేతులతో సంపాదిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. పిల్లలిద్దర్నీ పుత్తూరులోని ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో చదివిస్తున్నారు. వీరితోనే మోహన్‌ తల్లి చంద్రకళ(65) కూడా ఉన్నారు. పైళ్లెనప్పటి నుంచి దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు.

మనసెలా ఒప్పింది మోహనా?

ఇంతలో మోహన్‌కు ఫోన్‌ చేయగా.. ఆయన ఫోన్‌ కలవలేదు. పోలీసులకు సమాచారం ఇద్దామన్నా వారు అందుబాటులో లేరు. స్థానికులు కొందరు పుత్తూరులో పిల్లలు చదువుతున్న స్కూల్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో మోహన్‌ వచ్చాడని, తమ మామ చనిపోయాడు అని చెప్పి పిల్లలను తీసుకుని స్కూటీపై వెళ్లిపోయాడని చెప్పారు. అనుమానం వచ్చి ఎలాగోలా పోలీసులకు సమాచారం ఇచ్చారు. మోహన్‌ ఫోన్‌ నంబర్‌తో పాటు స్కూటర్‌ నంబర్‌ గుర్తించి ఆచూకీ తెలుసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడింది. మోహన్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయడంతో లోకేషన్‌ను గుర్తించలేకపోయారు. అయితే సీసీ కెమెరాల సాయంతో స్కూటర్‌ను గుర్తించగలిగారు. నారాయణవనం నుంచి పుత్తూరు ఆర్డీఎం గేట్‌ సమీపంలోని కార్పొరేట్‌ స్కూల్‌కు, కార్వేటినగరం, తమిళనాడు పళ్లిపట్టు మీదుగా అడవికండ్రిగ దారిలో వేపగుంట రైల్వేస్టేషన్‌ వరకు సూటర్‌లో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. వేపగుంట రైల్వేస్టేషన్‌కు వెళ్లి పరిసరాలను గాలించే లోపే చైన్నె నుంచి కాచిగూడ వెళ్లే రైలు కింద మోహన్‌, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన స్థానికంగా కలచివేసింది. ముక్కపచ్చలారని కొడుకు, చూడచక్కని కుమార్తెను అతికిరాతకంగా రైలుకింద తోసేసినట్టు చూపరులు తెలిపారు. ఆ తర్వాత వేగంగా వెళ్తున్న రైలుకు ఎదురెళ్లి మోహన్‌ కూడా మృత్యుఒడికి చేరినట్టు కన్నీళ్లు పెట్టుకున్నారు.

అంతులేని విషాదం

వెంకటకృష్ణపాళెంలో అంతులేని విషాదం నెలకొంది. ఒకే ఇంట్లో ఐదుగురు మృత్యువాత పడడంతో స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలచివేసింది. అత్తా కోడళ్ల మృత దేహాన్ని పరిశీలించిన పుత్తూరు డీఎస్పీ రవికుమార్‌, రూరల్‌ సీఐ రవీంద్ర కేసును నమోచు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని మీడియాకు తెలిపారు.

కౌశిక్‌ (ఫైల్‌)

ముక్కలైన మృతదేహాలు

రైలు కింద పడి మృతి చెందిన మోహన్‌తో పాటు పిల్లలు హిమని, కౌశిక్‌ల మృతదేహాలు ముక్కలై, చెల్లాచెదుగా ఉంటడాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మోహన్‌, కౌశిక్‌ల తలలు మొండెం నుంచి తెగి పట్టాలపై దూరంగా పడి ఉండడాన్ని పోలీసులే చూడలేక పోయారు. మోహన్‌ తల రెండు ముక్కలై పట్టాలకు రెండు వైపులా పడి ఉంది. రాత్రి 7.15 గంటలకు జరిగిన ప్రమాదాన్ని రైలు పైలట్‌ పుత్తూరు రైల్వే స్టేషన్‌కు సమాచారాన్ని అందించాడు. రైల్వే పోలీసులు పట్టాలపై గాలిస్తూ ప్రమాద స్థలానికి చేరుకుని మృత దేహాలను పరిశీలించారు. సమాచారాన్ని అందుకున్న నారాయణవనం పోలీసులు, మృతుని సన్నిహితులు వేపగుంట, పరమేశ్వరమంగళంల మధ్య రైల్వే ట్రా క్‌కు చేరుకున్నారు. పిల్ల స్కూల్‌ యూనిఫాంను, శరీర ఆకృతిని గుర్తించిన స్థానికులు మోహన్‌, అతని పిల్లలుగా గుర్తించారు. రాత్రి 11 గంటలకు మృతదేహాల భాగాలను పోస్ట్‌మార్టం నిమిత్తం రైల్వే పోలీసులు పుత్తూరుకు తరలించారు.

హత్య ఎందుకు చేశారనీ?

హరిత, చంద్రకళను దారుణంగా హత్యచేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్థికలావాదేవీలు ఏవీ లేవని.. వివాహేతర సంబంధం లాంటివి కూడా చూడలేదని స్థానికులు చెబుతున్నారు. మోహన్‌కూడా సౌమ్యుడని, పిల్లలు, భార్యతో అన్యోన్యంగా ఉండేవాడని పేర్కొంటున్నారు. అయితే తల్లి, భార్యను చంపే మనస్తత్వం కాదని అంటున్నారు. మరి వీరిని ఎవరు హత్యచేశారు.. ఎందుకు చేశారో తెలియరావడం లేదు. బ్యాంక్‌ నుంచి వచ్చిన మోహన్‌ ఇంటికి రాకుండా పక్కింట్లో డబ్బులిచ్చి.. అటునుంచి అటే వెళ్లిపోవాల్సిన అవసరం ఏముందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లలను రైలు కింద తోసి కర్కశంగా చంపడం చూస్తూ ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించి ఉండొచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏదైమైనా పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement