అడవిలో ఎక్కడైనా జింక, పశువు చనిపోయి ఉంటే సమీపంలో పులి ఉంటుందని సంకేతం.
అలాగే పక్షులు, నెమళ్ల అరుపులు వినిపిస్తే అప్రమత్తం కావాలి.
పెద్ద పులి, చిరుత వచ్చేటప్పుడు అలారంలా నెమళ్లు అరుపులతో హెచ్చరికలు చేస్తాయి.
అడవుల్లో పొదలు, గుహలు వంటి చీకటి ప్రదేశాలు పులులకు ఆవాసాలు.
అడవిలోకి ఒంటరిగా వెళ్లొద్దు. చేతిలో బలమైన వెదురు కర్ర ఉండాలి. సమీప గ్రామస్తుల్ని వెంట తీసుకువెళ్లాలి.
పులిని చూసేటప్పుడు అసలు భయపడకూడదు. పులిని చూసిన వెంటనే పరుగెత్తకూడదు.
పులి సంచరిస్తున్నట్లు తెలిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఉదయం, సాయంత్రం, చీకటి పడిన తర్వాత పులి కదలికలు ఎక్కువగా ఉంటాయి. రాత్రివేళ మరింత చురుగ్గా ఉంటాయి. ఈ సమయాల్లో ఎక్కువగా తిరగకూడదు.
రంగు రంగుల దుస్తులు కాకుండా లేత రంగుల దుస్తులు ధరించాలి.
చీకటిలో ఆరుబయట బహిర్భూమికి వెళ్లరాదు.
పులి కదలికలు ఉండే ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లరాదు.
అరణ్యం వదిలి..
ఆ అడవుల నుంచే!
జిల్లాలో పెరుగుతున్న
చిరుతల రాక
అడవుల్లో ఉండాల్సిన చిరుత పులులు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆహారం, నీరు లేక నీరసించి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నాయి. ఇలాంటి ఘటనే ఇప్పుడు చిత్తూరులో చోటు చేసుకుంది. ఇటీవల వరుసగా రెండు చిరుత పులులు జనారణ్యంలోకి వచ్చి మృత్యువాత పడ్డాయి. మరికొన్ని అక్కడక్కడా తచ్చాడుతూ జనాల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. వీటిని కట్టిడి చేయాల్సిన అటవీశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
చిత్తూరు కార్పొరేషన్: ఇటీవల నగరంలోని సీజీపల్లె లో చిరుతపుల్లి మెట్లులేని పాడుబడిన బావిలో పడి ప్రమాదవశాత్తు మరణించింది. అలాగే గత ఆదివారం దొడ్డిపల్లె హౌసింగ్ కాలనీలో గాయపడి ఆహారం లేక ప్రాణాలు విడిచింది. ఇది ఒక్క చిత్తూరులోని పరిస్థితే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న దుస్థితి. అభయారణ్యంలో సరైన ఆహారం, నీరు దొరకకపోవడంతో చిరుతలు, క్రూరమృగాలు జనావాసాల్లోకి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. 2011 నవంబర్ 29 నుంచి 2026 ఏప్రిల్ 19 వరకు తొమ్మిది చిరుత పులులు ప్రాణాలు విడిచాయి. వీటి సంరక్షణ, కట్టడి గురించి అటవీశాఖ లైట్ తీసుకుంటోందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
పులుల లెక్క తేలేదెట్టా?
జిల్లాలో మొత్తం 1.95 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. చిత్తూరు ఈస్ట్, వెస్ట్, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పంతో మొత్తం 6 రేంజ్‌లున్నాయి. మొత్తం 24 సెక్షన్లు, 84 బీట్లు ఉన్నాయి. కానీ అధికారికంగా జిల్లాలో ఎన్ని పులులు ఉన్నాయంటే అటవీశాఖ అధికారుల వద్ద ప్రాథమిక సమాచారం లేదు. ఇటీవల జరిగిన జంతుగణనలో కూడా సరైన సమాచారం దొరకలేదు. ఎక్కువగా తిరుపతి, తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి ఇటువైపు చిరుతలు వస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాలక్రమేణా వాటి సంతతి పెరగడంతో వందల సంఖ్యలో జిల్లాలోని అడవుల్లో పులులు సంచరిస్తున్నట్లు సమాచారం.
వలయాల ఆక్రమణ
పులుల వయస్సు ఐదేళ్లు దాటేసరికి తమకంటూ ఓ వలయాన్ని సృష్టించుకుంటాయి. ఆ పై మరో పదేళ్ల పాటు ఆ వలయంలో జీవిస్తాయి. ఇవి ఆక్రమణలకు గురైతే వాటి ఆవాసం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ సమయంలో అడవులను దాటి జనావాసాలకు వస్తుంటాయి. ఇలా 2011 నుంచి ఇప్పటి వరకు అనేక కారణాలతో చిరుతలు మృతిచెందాయి.
సిబ్బంది కొరత
పులుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బంది అంటూ లేరు. వాటి సంరక్షణకు చర్యలు పెద్దగా లేవు. ప్రస్తుతం ఉన్న కింద స్థాయి సిబ్బందితోనే పనులు చేస్తున్నారు. ఉదాహరణకు చిత్తూరు ఈస్ట్, వెస్ట్ పరంగా ఎఫ్‌బీఓ, ఏబీఓలు 65 మంది ఉండాల్సి ఉండగా దాదాపు 30 మంది వరకు సిబ్బంది కొరత ఉన్నారు. అలాగే ఔట్‌స్సోరింగ్ సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిరుతల కట్టడి కష్టమే మరి..!
జాగ్రత్తలు తప్పనిసరి
తిరుపతి, తమిళనాడు, కర్ణాటక అడవుల నుంచి చిరుతలు వచ్చినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఎండకాలం కావడంతో అడవిలో మరింత వేడిగా ఉండడం, నీరు దొరకకపోవడంతో అటవి నుంచి బయటకు వస్తున్నట్లు భావిస్తున్నారు. కొందరు ఆకతాయిలు అడవుల్లో నిప్పు పెట్టడంతో భయాందోళనకు గురై బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కువగా అడవి పక్కన ఉండే ప్రాంతాలు, గ్రామాలకు ఇవి వస్తున్నాయి. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే పొలాలు, స్థలాలు, ఇళ్ల వద్ద ఉండే వారు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
నిస్సహాయ స్థితి
పులులు వస్తున్నా అటవీశాఖ వాటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోంది. వేలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉందని, అవి ఏ పక్క నుంచి వస్తాయో తెలుసుకోవడం కష్టమంటున్నారు. అనుమానిత ప్రాంతాల్లో ట్రాప్‌కెమెరాలు పెడుతున్నా.. అందులో వాటి జాడ తెలియడం లేదని చెబుతున్నారు. పులి వచ్చినప్పుడు వాటికి గన్‌ద్వారా మత్తు మందు ఇవ్వాలన్నా తిరుపతి జూపార్కు నుంచి వైద్యబృందం వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. రాయలసీమ మొత్తానికి ఈ వైద్య బృందం మాత్రమే ఉంది. జిల్లాకు రెస్క్యూ వాహనం అయిన హనుమాన్‌ను ప్రభుత్వం కేటాయించింది. కానీ అవి పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. జిల్లా కేంద్రంలో లేవు. ఇక్కడ ఉన్న సిబ్బంది వద్ద తగిన పరికరాలు లేవు. దొడ్డిపల్లెలో పులి కొన ఊపిరితో ఉన్నా రెస్క్యూటీం వచ్చే వరకు ప్రాణభయంతో సిబ్బంది నీరుకూడా పోయ లేని పరిస్థితి. పలమనేరు నుంచి వాహనం చిత్తూరుకు చేరుకున్న క్షణాల్లో చిరుత తుదిశ్వాస విడిచింది. జిల్లా కేంద్రమలో రెస్క్యూవాహనాలు, డాక్టర్ లేకపోవడం నిస్సయంగా మారింది.


