– ముగ్గురి అరెస్ట్
కుప్పం రూరల్: మండలంలో సారా తయారు చేస్తున్న స్థావరాలపై దాడిచేసి ముగ్గురిని అరెస్టు చేసినట్టు కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ముందుగా అందిన సమాచారం మేరకు మంగళవారం రాత్రి కుప్పం మండలంలోని బలమద్దకొట్టం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద దాడి చేసినట్టు తెలిపారు. సారా తయారు చేస్తున్న బలమందకొట్టాలు గ్రామానికి చెందిన లక్ష్మీపతి, రఘుపతి, కృష్ణప్పను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి నుంచి 7 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎవరైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
రైలు కిందపడి వ్యక్తి మృతి
కుప్పంరూరల్: రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన కుప్పం – మల్లానూరు రైల్వే మార్గంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్నట్టు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివశంకరప్ప తెలిపారు. సుమారు 50 ఏళ్ల వయస్సు కలిగి, గడ్డం మొత్తం తెల్ల రంగులో ఉందన్నారు. ఈ గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం రాత్రి ఏదో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆనవాళ్లు గుర్తించామన్నారు. మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి, గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ముందస్తు అడ్మిషన్ల ఫ్లెక్సీలు తొలగించాలి
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లంటూ ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు బుధవారం డీఈవో రాజేంద్రప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అప్పుడే అడ్మిషన్లు ప్రారంభమంటూ కార్పొరేట్ విద్యాసంస్థలు చిత్తూరు ప్రధాన కూడళ్లలో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడే అడ్మిషన్లు చేపట్టాలన్నారు. కానీ, విద్యాశాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ముందస్తు ప్రకటనలు ఇవ్వడం అన్యాయమని తెలిపారు. నగరంలో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు వెలుస్తున్నా విద్యాశాఖ, మున్సిపల్ అధికారులకు కనపడకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించని పక్షంలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఏఐఎస్‌ఎఫ్ నాయకులు లోహిత్, గౌరవ్, లిఖిత్ పాల్గొన్నారు.
గడువు ముగిసింది!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలంలోని అనంతాపురం శెట్టిన్‌తంగాల్ నుంచి ఇసుక తవ్వకాలపై ఫిర్యాదులు వెలువెత్తుతున్నా యి. దీనిపై సీఎంఓ ఆఫీసుకు ఫిర్యాదు వెళ్లడం... తహసీల్దార్ కల్యాణికి ఫోన్ రావడంతో స్పందిచారు. బుధవారం ఇసుక తవ్వకాలు జరుగుతున్న చోట పరిశీలించారు. అలాగే డంప్‌ను కూడా తనిఖీ చేశారు. డంప్‌నకు తోలేందుకు అనుమతులు ఉన్న ఉత్తర్వులను క్షుణంగా పరిశీలించారు. ఆ ఉత్తర్వుల్లో ఈ ఏడాది మార్చి 11వ తేదీతో గడువు ముగిసినట్లు గుర్తించారు. ఈ మేరకు దీనిపై సీఎంఓ ఆఫీసుకు నివేదికలు సమర్పించనున్నారు. కాగా ప్రస్తుతం డంప్‌కు తరలిస్తున్న ఇసుక అనధికారికమేనని తెలుస్తోంది.
ధరిత్రి రక్షణ అందరి బాధ్యత
చిత్తూరు కలెక్టరేట్ : ధరిత్రి రక్షణ అందరి బాధ్యత అని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. బుధవారం జిల్లా సైన్స్ సెంటర్‌లో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ మానవ మనుగడ భూమి పరిరక్షణతోనే ముడిపడి ఉందన్నారు. ప్రస్తుత కాలంలో మానవ తప్పిదాల వల్ల భూమి అనేక విపత్తులకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాల ని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మొక్క లు నాటారు. అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ థామ స్, సైన్స్ సెంటర్ క్యూరేటర్ జయంతి, జన విజ్ఞాన వేదిక పర్యావరణ విభాగం జిల్లా కన్వీనర్ సుధాకర్, అగస్త్య ఫౌండేషన్ ఇన్‌స్ట్రక్టర్ మోహన్ పాల్గొన్నారు.


