చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా 2047 నాటికి 50 శాతం పచ్చదనం సాధించే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో అటవీ, రెవెన్యూ, అనుబంధ శాఖల అధికారులతో హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం అమలు పై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 34 శాతం పచ్చదనాన్ని 50 శాతానికి పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు పర్యావరణంతో పాటు ఆర్థిక ప్రయోజనం చేకూరేలా ఫలవృక్షాలు, కలప జాతి మొక్కలను పంపిణీ చేయాలన్నారు. జిల్లాలోని ఏడు నర్సరీలలో రైతులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పలమనేరు డివిజన్ పరిధిలోని ముసలిమడుగును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మౌలిక వసతులకు రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో చేపడుతున్న సోలార్ సిస్టమ్స్, ట్రెంచ్‌ల పనులకు ఈ నెల 10వ తేదీ లోపు అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. డీఎఫ్‌ఓ జి.సుబ్బరాజు మాట్లాడుతూ అగ్రో ఫారెస్ట్రీ పాలసీలో రిజర్వ్డు అడవులకు వెలుపల పచ్చదనాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రవికుమార్, డ్వామా పీడీ రవికుమార్, గిరిజన సంక్షేమ అధికారి మూర్తి, సెరికల్చర్ జేడీ పద్మావతి, ఇరిగేషన్ ఎస్‌ఈ వెంకటేశ్వరరాజు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.


