చిత్తూరు అర్బన్: చోరీ కేసులో నిందితులుగా ఉన్న ఎన్.నేతాజీ(23), వి.కుమార్ (21), ఎం.ప్రకాష్ (24), కె.వేణుగోపాల్ (19) అనే నలుగు రు నిందితులకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసి క్యూటర్ ఉమాదేవి కథనం మేరకు.. బంగారుపాళ్యం సమీపంలో ఎక్స్‌ప్రెస్ హైవేకు సంబంధించిన జరుగుతున్న పనుల వద్ద ఇనుప ప్లేట్లు చోరీకి గురైనట్లు నిర్వాహకులు గతేడాది ఆగస్టు 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.3 లక్షల విలువైన 30 ప్లేట్లు చోరీకి గురవడంతో బంగారుపాళ్యం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా గతేడాది సెప్టెంబర్ 5న బైరెడ్డిపల్లెకు చెందిన నేతాజీ, చిత్తూరు చెర్లోపల్లెకు చెందిన కుమార్, ప్రకాష్, వేణుగోపాల్ చోరీకి పాల్పడ్డట్లు గుర్తించి.. సీఐ శ్రీనివాసులు నిందితులను అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. నేరం రుజువుకావడంతో నిందితులకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉమాదేవి తీర్పునిచ్చారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
గంగాధర నెల్లూరు: మండలంలో గుర్తుతెలియని మృతదేహం బుధవారం కలకలం రేపింది. పోలీసుల కథనం.. జీడీనెల్లూరు మండలం, వీరకనెల్లూరు గ్రామ పంచాయతీ సమీపంలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృత దేహం లభ్యమైంది. మృతుడికి సుమారు 50 ఏళ్లు ఉంటుదని సీఐ ప్రసాద్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు జీడీనెల్లూరు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
విజయపురం (నగరి) : విజయపురం మండలంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య అరెస్టు చేశారు. పోలీసుల కథనం.. మంగళంకండ్రిగ పంచాయతీ, గాండ్లకండ్రిగ చెక్ పోస్టు వద్ద బుధవారం ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. తిరుత్తణి తాలుకా, పట్టాభిరామపురం గ్రామానికి చెందిన కాశీనాథన్ (42), ఆర్ పయణి (49) అనే వ్యక్తులు అక్రమంగా ఆంధ్ర మద్యం బాటిళ్లను తరలిస్తుండగా వారిని పట్టుకున్నారు. మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకుని, ఆ ఇద్దరినీ అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ దాడిలో హెచ్‌సీ దేవరాజులు, సిబ్బంది జయచంద్ర, శివకుమార్ పాల్గొన్నారు.


