చిత్తూరు అర్బన్: సెల్‌ఫోన్లు పోగొట్టుకోవడం, కొన్నిసార్లు ఫోన్లు చోరీకి గురవడం లాంటి ఘటనలను ఛేదించిన చిత్తూరు పోలీసులు దాదాపు రూ.1.2 కోట్ల విలువ చేసే 501 సెల్‌ఫోన్లను బాధితులకు అప్పగించారు. బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తుషార్ డూడీ వివరాలను వెల్లడించారు. ఫోన్లను పోగొట్టుకున్న వాళ్లు, చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితులు వాటి వివరాలను పోలీసుశాఖకు వాట్సాప్‌లో ఫోన్–9440900004 అనే నంబరుకు హాయ్ అని పెట్టడం, సీఈఐఆర్ అనే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా ఫోన్లను కనిపెట్టి.. అప్పగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తుచేసి బాధితుల వద్ద ఉన్న వివరాల ఆధారంగా ఫోన్లను దేశంలోని ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర లాంటి పలు రాష్ట్రాల నుంచి తెప్పించామన్నారు. ఇందుకోసం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఐటీ విభాగం పనిచేస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 14 దఫాల్లో 4,607 సెల్‌ఫోన్లను బాధితులకు అప్పగించామన్నారు. వీటి విలువ రూ.9.55 కోట్లు ఉంటుందన్నారు. సెల్‌ఫోన్లను రికవరీ చేసిన సీసీఎస్ సీఐ ఉమామహేశ్వరరావు, సిబ్బంది బాపూజీ, రఘురామ్, ఇతర సిబ్బందికి సర్టిఫికెట్లను అందచేసి, వారిని అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, డీఎస్పీ వెంకట నారాయణ, ట్రైనీ ఐపీఎస్ అధికారి తరుణ్ పహ్వా పాల్గొన్నారు.


