– ఐదుగురికి గాయాలు
కుప్పంరూరల్: ఇరుకు రోడ్డులో వేగంగా కారు నడిపి మూడు ద్విచక్ర వాహనదారులను ఢీ కొన్న ఘటన కుప్పం మండలం, మల్లానూరు వద్ద బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. కుప్పం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కారులో తమిళనాడు నుంచి కుప్పం వైపు వస్తున్నాడు. మల్లానూరు వద్దకు రాగానే చెరువు కట్టపై ఇరుకు రోడ్డులో వేగంగా వచ్చి మల్లానూరు వైపు వచ్చిన మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. ప్రమాదంలో చీగలపల్లికి చెందిన వెంకటేష్, తిమ్మోజీ, కేజీఎఫ్‌కి చెందిన ప్రభు, విజయ్‌బాబు, సింగారపురానికి చెందిన చెన్నకేశవన్‌లు గాయపడ్డారు. స్థానికులు వీరిని పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరిలో ప్రభు, వెంకటేష్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. దీనిపై కుప్పం ఎస్‌ఐ బాబును వివరణ కోరగా, తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కాగా, కారు కుప్పం టౌన్ బ్యాంకు మేనేజర్ శివకు చెందినదిగా సమాచారం.
అతి వేగమే కారణం
తమిళనాడు వైపు నుంచి వచ్చిన కారు మలుపు వద్ద వేగంగా వారవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఒకరి తరువాత ఒకరిని ఢీ కొన్నా కారు వేగం ఆగలేదని చెప్పారు. క్షతగాత్రులు రోడ్డుపై పడినా కారులోని వ్యక్తులు దురుసుగానే ప్రవర్తించినట్లు సమాచారం.


