ఎగ్గొట్టి.. రైతు పొట్టగొట్టి! | - | Sakshi
Sakshi News home page

ఎగ్గొట్టి.. రైతు పొట్టగొట్టి!

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

● రూ.150 కోట్ల వరకు ఎగవేత ● ఇంకా బకాయిలు చెల్లించని కొన్ని ఫ్యాక్టరీలు ● చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

జిల్లాలో మామిడి పంట చెల్లింపులో భారీ దోపిడీ

కాణిపాకం: చంద్రబాబు ప్రభుత్వం గతేడాది తోతాపురి రకం మామిడి కేజీకి రూ.8 గిట్టుబాటు ధరను ప్రకటించింది. ప్రభుత్వ ప్రోత్సాహక నిధిగా రూ.4 చెల్లిస్తానని హామీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రోత్సాహక నిధిని మాత్రం చెల్లించి చేతులెత్తేసింది. గిట్టుబాటు ధరను గాలికొదిలేసింది. దీంతో ఫ్యాక్టరీ యజమానులు ఇష్టానుసారంగా బకాయిలు చెల్లించాయి. ఒకటి రెండు ఫ్యాక్టరీలు తప్ప మిగిలిన ఫ్యాక్టరీలన్నీ కూడా కేజీకి రూ.4 చొప్పున చెల్లించాయి. గిట్టుబాటు ధర రూ.8 ఇవ్వాల్సిన చోట రూ.4 మాత్రమే చెల్లించాయి. దీంతో ఒక్క కిలోపైనే రూ.4 వరకు నష్టపోవాల్సి వచ్చింది. ఈ లెక్కన రైతులకు మొత్తం మీద రూ.150 కోట్ల మేర ఫ్యాక్టరీలు ఎగ్గొట్టినట్టు రైతులు ఆరోపిస్తున్నారు.

తప్పని అవస్థలు

దిగుబడి ఎక్కువగా రావడాన్ని అవకాశంగా తీసుకున్న ఫ్యాక్టరీలు మూకుమ్మడిగా ఒకే నిర్ణయం తీసుకుని ధరలను తగ్గించాయి. మార్కెట్‌లో పోటీ లేకుండా, రైతులకు ప్రత్యామ్నాయం లేకుండా ఈ నిర్ణయం అమలు చేశా యి. రైతులెవరూ ఎదు రు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ధర తక్కువగా ఉండడమే కాకుండా, చాలా చోట్ల చెల్లింపులు కూడా పూర్తిగా జరగలేదు. కొన్ని ఫ్యాక్టరీలు ఏడాది గడిచినా బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు ఆయా ఫ్యాక్టరీల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోంది.

ఈ సారీ అంతేనా?

గత ఏడాది అనుభవంతో ఈసారి మామిడి సాగుపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరైన ధర దక్కకపోతే, చెల్లింపులు సమయానికి రాకపోతే సాగును తగ్గించే ఆలోచనలో ఉన్నారు. ఇది భవిష్యత్తులో మామిడి ఉత్పత్తిపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ఏడాది అధిక దిగుబడిని సాకుగా చూపి జూస్‌ ఫ్యాక్టరీలు చేతులెత్తేశాయి. ప్రభుత్వం తోతాపురి కిలోకి రూ.8 మద్దతు ధర ప్రకటించినా పట్టించుకోకుండా ముంచేశాయి. నామమాత్రంగా కిలోకి రూ.4 చెల్లించి చేతులు దులుపుకున్నాయి. జిల్లా మొత్తం మీద 3.75 లక్షల మెట్రిక్‌ టన్నులకు గాను రూ.300 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా.. అందులో రూ.150 కోట్లు మాత్రమే చెల్లించాయి. మిగిలిన మొత్తాన్ని ఎగ్గొట్టి రైతులను నట్టేట ముంచేశాయి. ఇంకా కొన్ని ఫ్యాక్టరీలు ఆ మొత్తాన్ని కూడా చెల్లించకుండా రైతులను వేధించుకు తింటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయోనని రైతులు ఆందోళనలో మునిగిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement