నిధుల జాతర..నాణ్యతకు పాతర! | - | Sakshi
Sakshi News home page

నిధుల జాతర..నాణ్యతకు పాతర!

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

● రూ.60 లక్షలతో కేంద్రీయ విద్యాలయ భవనం ఏర్పాటు ● ప్రారంభానికి ముందే నెర్రెలు బారిన గోడలు ● పట్టనట్టు వ్యవహరిస్తున్న జిల్లా యంత్రాంగం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : పైన పటారం..లోన లొటారంగా మారింది చిత్తూరులోని కేంద్రీయ విద్యాలయ భవన పరిస్థితి. ఇరువారం వద్ద సిల్క్‌బోర్డ్‌ కార్యా లయ భవనానికి మరమ్మతులు చేసి తాత్కాలిక కేంద్రీయ విద్యాలయ భవనంగా ఏర్పాటు చేశారు. శిథిలావస్థలో ఉన్న ఈ భవనానికి రూ.60 లక్షలతో మెరుగులద్దారు. కానీ నాణ్యతను గాలికొదిలేసి ౖపైపెనే రంగులద్ది వదిలేశారు. సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ భవనాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా.. లోపల నాణ్యత ప్రమాణాలపై ఏ ఒక్కరూ కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అత్యుత్సాహం

సీఎం చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ భవనాన్ని ఆరంభించాలని పాలకులు ఉవ్విళ్లూరినట్టు స్పష్టమవుతోంది. చీలికలు ఉన్న భవనాన్ని హడావిడిగా విద్యార్థులకు అప్పగించేశారు. కనీసం గోడల పగుళ్లను పూడ్చకుండానే ప్రారంభోత్సవం చేసి వదిలేశారు.

అంతా మాయాజాలమేనా?

ఈ భవన మరమ్మతులు, వసతుల కల్పనకు రూ.60 లక్షల వరకు కేటాయించారు. క్షేత్ర స్థాయి లో పరిస్థితి చూస్తుంటే ఈ నిధులు ఎటు వెళ్లాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొత్తగా వేసిన రంగులు గోడల మీద మెరుస్తున్నా, లోపల ఉన్న అసలు సమస్యలు అలాగే ఉన్నాయి.

జాడలేని అగ్నిమాపక పరికరాలు

వందలాది మంది విద్యార్థులు చదువుకునే భవనంలో దురదృష్టవశాత్తు అగ్నిప్రమాదాలు జరిగితే పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనీసం ఒక ఫైర్‌ ఎక్స్‌టింగ్యూషర్‌ కూడా అందుబాటులో లేదు. అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు బయటకు రావడానికి సరైన మార్గాలు సైతం లేవు.

నెర్రెలు బారిన కేంద్రీయ విద్యాలయ భవన గోడలు

ఇరువారం వద్ద ప్రారంభమైన కేంద్రీయ విద్యాలయం

ప్రశ్నార్థకం

అధికారులు.. కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భవన భద్రత సర్టిఫికెట్‌ ఉందో లేదో అనే అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి. ఈ విషయం కలెక్టర్‌ స్పందించి సమగ్ర విచారణ జరపకపోతే భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే భవనంలో చీలికల మరమ్మతులు చేయించి, అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement