అమ్మా.. లలితా, సరస్వతీ! | - | Sakshi
Sakshi News home page

అమ్మా.. లలితా, సరస్వతీ!

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

● రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి ● అనాథగా ఒక్కగానొక్క కుమారుడు ● శోకసంద్రమైన మేకలనాగిరెడ్డిపల్లె

బైరెడ్డిపల్లె/వి.కోట: ‘రే..హేమచంద్రా ఎక్కడున్నావురా!. లలితా.. సరస్వతీ ఏం చేస్తున్నారమ్మా..! ఉలుకూ పలుకూ లేకుండా ఇంట్లోనో ఉన్నారా..?.. ఇంటికొచ్చి కూర్చు న్నా పలకరించడానికి రాలేదేమమ్మా?. లలితా.. మీ తమ్ముడ్ని ఎక్కడొదిలి వెళ్లావే..?’ అంటూ అటుగా వచ్చివెళ్లేవారు ఆ ఇంట్లోని పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకోవడం చూపరులను కలచివేసింది. బైరెడ్డిపల్లె మండలంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కుమార్తె మృతి చెందారు. ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మిగిలాడు.

అత్తగారింటికెళ్తూ.. అనంతలోకాలకు

బైరెడ్డిపల్లె మండలం, మేకలనాగిరెడ్డిపల్లెకు చెందిన హేమచంద్ర (38)కు 15 ఏళ్ల క్రితం వికోట మండలం, యడుగూరుకు చెందిన సరస్వతి(32)తో వివాహమైంది. వీరికి కుమార్తె లలిత (12), కుమారుడు సాయికుమార్‌(5) ఉన్నారు. హేమచంద్ర గత నాలుగేళ్లుగా బెంగళూరులో కార్పెంటర్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. అప్పుడప్పుడూ సొంతూరుకొచ్చి వెళ్తుంటాడు. సరస్వతి పుట్టింట్లోనే ఉంటూ ఇద్దరు బిడ్డలను పెట్టుకుని చదివిస్తోంది. ఇదిలావుండగా రెండు రోజుల క్రితమే భర్త హేమచంద్ర బెంగళూరు నుంచి మేకలనాగిరెడ్డిపల్లెకి వచ్చాడు. సరస్వతి అమ్మగారింటి నుంచి కుమార్తెను తీసుకుని భర్తవద్దకు వెళ్లింది. ఆపై ఆదివారం సరస్వతిని అత్తగారింట్లో వదిలేసి బెంగళూరుకు వెళ్లేందుకు హేమచంద్ర సిద్ధమయ్యాడు. ద్విచక్ర వాహనంపై యడుగూరుకు వెళ్తుండగా పలమనేరు–కుప్పం జాతీయ రహదారిలోని కొమ్మరిమడుగు క్రాస్‌ వద్ద అతివేగంగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో హేమచంద్ర, సరస్వతి అక్కడికక్కడే మృతి చెందగా.. లలితకుమారి బెంగళూరులో చికిత్స పొందుతూ సోమవారం తనువు చాలించింది.

మాటలకందని విషాదం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో పలమనేరు మేకలనాగిరెడ్డిపల్లెలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాలకు సోమ వారం మధ్యాహ్నం దహనక్రియలు నిర్వహించారు. అమ్మా, నాన్నతోపాటు అక్కను చూస్తూ సాయికుమార్‌ ఎక్కిళ్లు పెట్టడం అందరినీ కలచివేసింది. ఆ బాలుడిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. అమ్మా..!.. నాన్నా.. అంటూ గుక్కపెట్టి ఏడ్చుతున్న బాలుడ్ని చూసి పలువురు కంటతడి పెట్టారు.

మృతులు లలిత

సరస్వతి

హేమచంద్ర

ఆప్యాయతానురాగాలతో అలరారిన ఆ పొదరిల్లు దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఒక్కగానొక్క గారాల పట్టీ నడయాడిన ఆ నివాసం శోకసంద్రంతో తడిసి ముద్దవుతోంది. దంపతుల అన్యోన్యానికి ఆలవాలమైన ఆ ఇల్లు మౌనముద్రతో రోదిస్తోంది. బైరెడ్డిపల్లె మండలం, మేకలనాగిరెడ్డిపల్లెలో ఎవరిని కదిలించినా ఆ ముగ్గురి మరణం గురించే చర్చ సాగుతోంది. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరూ మృత్యుఒడికి చేరగా.. ఒక్కగానొక్క కుమార్తె బెంగళూరులో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది. చిట్టిపొట్టి మాటలతో ఆకట్టుకునే ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మిగిలాడు. గుండెల్ని మెలిపెట్టే ఈ ఘటన పలమనేరు నియోజకవర్గంలో విషాదాన్ని మిగిల్చింది.

Advertisement
 
Advertisement
Advertisement