కార్వేటినగరం: కరువు మేఘాలు మరో మారు ఆవహించనున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురవకపోతే పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. తద్వారా ప్రజల ఉపాధికి విఘాతం కలగనుంది. చిత్తూరు జిల్లాలో ప్రజలు 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అందులోనూ ఖరీప్ సీజన్ అత్యంత కీలకం. దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తారు. ఏటా మే ఆఖరున కేరాళను తాకే నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో జిల్లాలోకి ప్రవేశిస్తాయి. రుతుపవనాల ప్రభావంతోనే వర్షాలు కురవడం.. కీలకమైన ఖరీప్ పంటల సాగుకు రైతులు శ్రీకారం చుట్టడం పరిపాటిగా మారుతోంది. అయితే ఈ సారి రుతుపవనాలకు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేతలు చెబుతున్నారు. ఎల్‌నినో కారణంగా రుతుపవనాలు బలహీనపడి సకాలంలో మంచి వర్షాలు కురవకపోవచ్చని చెబుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు తక్కువేనా?
చిత్తూరు జిల్లాపై ఎల్‌నినో ప్రభావం చూపిస్తే కరువు పరిస్థితులు తప్పవని అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో ఎంతకాలం ఉంటుందనే దానిపై ఇక్కడి వ్యవసాయం ఆధారపడి ఉంది. సీజన్ మొత్తం కొనసాగితే మరోసారి కరువు కబళించే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా గత కొన్నేళ్లుగా పంట కాలం, వర్షాలు గతి తప్పుతున్నట్లు శాస్త్రవేతలు చెబుతున్నారు. ఈ సారి అదే పరిస్థితి పునరావృత్తం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో అనుకూల వర్షాలు, అకాల వర్షాలు, ఈదురుగాలులు, అధిక ఉష్ణోగ్రతలు, చలితీవ్రత అధికంగా ఉండడం, పంట కాలాల్లో మార్పులు జరుగుతున్నట్లు గుర్తుచేస్తున్నారు.
ఎల్‌నినో... లా నినా అంటే!
ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వర్షాలు ఎలా ఉంటాయనే దానిపై పసిఫిక్ మహా సముద్రంలో సంభవించే వాతావరణ పరిస్థితులపై అధారపడి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎల్–నినో అలాగే లా నినా అనే పదాలు తరుచూ వింటుంటాం. ఎల్‌నినో అంటే వర్షాలు తక్కువ కురుస్తాయని, లా నినా అంటే మంచి వర్షాలు కురుస్తాయని చెబుతుంటారు. వాటి ఆధారంగా ఉష్ణోగ్రతలు, వర్షాలు, పంట దిగుబడులు అంచనా వేస్తుంటారు. ఈ క్రమంలో ఈ సారి ఎల్‌నినో ఉంటుందని భారత వాతావరణ శాఖ ఇటీవల హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. సాధారణం కన్నా వర్షాలు తక్కువగానే నమోదయ్యే సూచనలు ఉన్నట్లు ప్రకటించింది. పెరూ, ఈక్వెడార్‌లె ఏర్పడే వేసవి గాలుల వల్ల సంభవించే వాతావరణ మార్పులను ఎల్–నినోగా నామకరణం చేశారు. కొన్ని సంవత్సరాలకోసారి ఈ రెండింటిలో ఒకటి సంభవించడం జరుగుతోందని శాస్త్రవేతలు చెబుతున్నారు. అందులో ఎల్‌నినో ఏర్పడితే ప్రపంచంలో అనేక దేశాల్లో వర్షాలు తక్కువగా కురుస్తాయని, లా నినో ఏర్పడితే తుపాన్లు, అల్పపీడనాలు, వరదలు, సంభవిస్తాయని పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఎల్ నినో ఏర్పడడంతో భారత్, ఆస్ట్రేలియాతో పాటు మరికొన్ని దేశాల్లో తక్కువ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.


