న్యాయం చేయండి మహాప్రభో! | - | Sakshi
Sakshi News home page

న్యాయం చేయండి మహాప్రభో!

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు అర్జీదారులు పోటెత్తారు. తమకు జరుగుతున్న అన్యాయం పై బాధితులు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ, జేసీ ఆదర్శ్‌రాజేంద్రన్‌ వద్ద మొరపెట్టుకున్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఆర్‌వో మోహన్‌కుమార్‌, ఏవో వాసుదేవన్‌ పాల్గొన్నారు.

భూ ఆక్రమణలను అడ్డుకోండి

భూ ఆక్రమణలను అడ్డుకోవాలని పులిచెర్ల మండలం, ఎల్లంకవారిపల్లి గ్రామానికి చెందిన బాధితుడు యోగానందరెడ్డి కోరారు. విచారణ చేసి న్యాయం చేయాలంటూ పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. ఆయన మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా తమ గ్రామంలో నివసిస్తున్నట్లు తెలిపారు. అమర్‌నాథ్‌రెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా తమ గ్రామంలోని భూములను ఆక్రమించుకుంటున్నట్లు చెప్పారు. తన సొంత భూమిలోకి ప్రవేశించి దారి ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రశ్నించినందుకు రౌడీలా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు చెప్పారు. రికార్డులు పరిశీలించి న్యాయం చేయాలని బాధితుడు కోరారు.

40 ఏళ్ల నిరీక్షణ

చిత్తూరు నగరంలోని కామేశ్వర్‌నగర్‌ హౌసింగ్‌ సొసైటీ సభ్యులు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలనీ ఏర్పడి 40 ఏళ్లు పూర్తయినా, నేటికీ కనీస సదుపాయాలు లేవన్నారు. రహదారులు, డైనేజీ సౌకర్యాలు లేకపోవడంపై అధికారులను నిలదీశారు. గతంలో ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని, ఇప్పటికై నా మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్న కామేశ్వర్‌నగర్‌ కాలనీ వాసులు

అర్జీలు స్వీకరిస్తున్న ఉన్నతాధికారులు

Advertisement
 
Advertisement
Advertisement