సీఎం చంద్రబాబు పుట్టినరోజున దివ్యాంగులకు మేలు చేయాల్సింది పోయి, పథకాలకు కోతలు విధించి గుండెకోత మిగిల్చారని ఏపీ దివ్యాంగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కొణతం చంద్రశేఖర్ మండిపడ్డారు. సోమవారం తమ సమస్యలను పరిష్కరించాలంటూ పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 10 ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు ఉచితంగా అందించే మూడు చక్రాల వాహనాల పంపిణీ ప్రక్రియలో అనుసరిస్తున్న వైఖరి దారుణమన్నారు. నియోజకవర్గానికి పది వాహనాల చొప్పున పంపిణీ చేయడానికి దరఖాస్తులు స్వీకరించి, ఆఖరి దశ ఎంపిక సమయంలో కొత్త సదరం సర్టిఫికెట్‌లు ఉండాలనే నిబంధన పెట్టడం అన్యాయమన్నారు. పాత సదరం సర్టిఫికెట్‌లనే ప్రామాణికంగా తీసుకుని, మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేయాలని, అర్హులైన వారి పింఛన్ తొలగించకూడదని డిమాండ్ చేశారు. మహిళా నేత అరగొండ సుమతి, మునిరెడ్డి, బాధిత దివ్యాంగులు అరుణ, జ్యోతిప్రసాద్, నరేష్, భూపాల్ పాల్గొన్నారు.


