మహేశ్వర లీలలు | - | Sakshi
Sakshi News home page

మహేశ్వర లీలలు

Apr 20 2026 8:29 AM | Updated on Apr 20 2026 8:29 AM

● ఇక నగరంలోని ఓ ప్రముఖ స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు అప్పులపాలై దివాళా తీశాడు. ఈ వ్యవహారంలో తలదూర్చిన ఆ ఖాకీ.. సివిల్‌ పంచాయితీ చేసి రూ.13 లక్షల వరకు నగదు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● ఇటీవల జరిగిన కానిస్టేబుళ్ల బదిలీల్లో తనకు అనుకూలంగా స్టేషన్‌లో ఉన్న ఇద్దరిలో ఒకరిని కౌన్సెలింగ్‌కు హాజరుకానివ్వకుండా చేశాడు. మరొకరు యాదమరిలో పనిచేస్తున్నారని ఎస్పీని తప్పుదారి పట్టించి మళ్లీ వన్‌టౌన్‌ సీటులోనే కూర్చోపెట్టారని తోటి సిబ్బంది కోడై కూస్తున్నారు. ఈ ఆరోపణలు ఎస్పీ దృష్టికి వెళ్లగా ఆయన అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. అతని అవినీతి కార్యకలాపాలపై పూర్తి నివేదికను డీజీపీకి పంపనున్నట్లు తెలిసింది.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ జరిమానాల్లో చిలక్కొట్టుడు సొంత పోలీసు విషయంలోనూ చేతివాటం సైబర్‌ మోసంలో నిందితుడి వైపు ఉదాసీన వైఖరి చిత్తూరు వన్‌టౌన్‌లో కదిలిస్తే.. ఒక్కో గాథ

వెలుగులోకి

చిత్తూరు అర్బన్‌ : తప్పుచేసిన వారు ఎప్పటికై నా పట్టుబడక తప్పదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇటీవల వార్తల్లోకెక్కిన చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ మహేశ్వర చేసిన మాయల గురించి సిబ్బంది కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. న్యాయం కోసం స్టేషన్‌ మెట్లు ఎక్కిన వారితో రూ.లక్షల్లో బేరసారాలు చేస్తారని, తోటి సిబ్బంది విషయంలోనూ చేతివాటం చూపారని పేర్కొంటున్నారు. ఇలా ఒకటీ, రెండూ కాదు.. చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చివరకు పాపం పండడంతో వేటు పడింది.

పోలీసు కానిస్టేబుల్‌ కేసులోనూ అవినీతి

ఎస్పీ పర్యవేక్షణలో ఉన్న ఐటీ కోర్‌లో పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్‌ కుమార్తెను అల్లుడు హత్య చేయడానికి ప్రయత్నిస్తే వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఈ కేసులో నిందితుడు కోర్టులో ముందస్తు బెయిల్‌ తీసుకోవడానికి సీఐ సహకరించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. మనోవేదనకు గురైన బాధితురాలి తండ్రి ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ కల్పించుకుని కేసును మహిళా స్టేషన్‌కు బదిలీ చేయించారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో విచ్ఛలవిడితనం

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులను కోర్టులో హాజరుపరిస్తే ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఐ తనకు నమ్మినబంట్లుగా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లతో నిందితుల నుంచి నగదు వసూలు చేయించి వదిలేసినట్టు సమాచారం. ఈ కేసుల్లో సుమారు రూ.60 లక్షలకు పైగా అవినీతికి పాల్పడినట్టు తెలుస్తోంది. భద్ర, రక్షక్‌లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పలేక సతమతమవుతున్నారు.

కేసు నుంచి నిందితులను తప్పించిన వైనం

గత శనివారం శ్రీనివాసులు నాయుడు అనే వ్యక్తి చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణను కలిశారు. తన కుమార్తె ఇటీవల మృతి చెందిందని, దీనికి కారణమైన నిందితుల పేర్లను పోలీసు అధికారికి చెబితే, వాళ్లను కేసు నుంచి తప్పించడానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారని వాపోయాడు. నిందితుల నుంచి రూ.6 లక్షల తీసుకుని తప్పించేశారని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.

చిత్తూరులోని మిట్టూరులో పోలీసుల కోసం సంక్షేమ ఆసుపత్రిని ఏర్పాటుచేశారు. అక్కడ పనిచేసే డాక్టర్‌ లావణ్యను సైబర్‌ నేరగాళ్లు మోసం చేసి దాదాపు రూ.కోటి వరకు నగదు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో కింగ్‌పిన్‌గా ఉన్న రాజు బాసప్ప అలియాస్‌ రాజు చల్లప్ప అనే వ్యక్తిని అప్పటికే తమిళనాడులోని బ్యాంక్‌ ఫ్రాడ్‌ సెల్‌ విభాగం అధికారులు అరెస్టు చేసి మదురై జైలులో ఉంచారు. సీఐ నేరుగా జైలుకు వెళ్లి అతనితో బేరం కుదుర్చున్నాడు. నిందితుడు జైలు నుంచి విడుదలయ్యాక చిత్తూరు కోర్టులో పీటీ వారెంటు తీసుకున్నాడు. ప్రధాన నిందితుడిని తప్పించి కేరళకు చెందిన ఇద్దరు సహ నిందితులపై కేసు నమోదు చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement