పశుసంవర్థక సహాయకుల్లో గుబులు..! | - | Sakshi
Sakshi News home page

పశుసంవర్థక సహాయకుల్లో గుబులు..!

Apr 20 2026 8:29 AM | Updated on Apr 20 2026 8:29 AM

● నియామకాలపై అనుమానాలు ● ఫేక్‌ సర్టిఫికెట్లు, వెయిటేజ్‌ మార్కులపై వివాదం ● విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో పశుసంవర్థక శాఖ నియామకాలపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోపాలమిత్రలుగా పనిచేసిన పలువురు తప్పుడు విద్యార్హత పత్రాలు సమర్పించి అనిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ప్రభుత్వం ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకుంది. మరికొంత మందిపైనా వేటు వేసేందుకు సిద్ధమవుతోందన్న సమాచారం కలకలం రేపుతోంది. దీంతో సహాయకుల్లో టెన్షన్‌ పట్టుకుంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 449 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 565 మంది పశుసంవర్థక సహాయకులు పని చేస్తున్నారు. వీరిలో కొందరి నియామకాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గోపాలమిత్రగా పనిచేస్తూనే ఇంటర్‌ పూర్తి చేసి, ఆ తర్వాత సచివాలయ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగంలో ఉండగానే చదువు పూర్తి చేయడం, అదే సమయంలో ఇన్‌–సర్వీస్‌ కోటాలో వెయిటేజ్‌ మార్కులు పొందడం అనేక సందేహాలకు దారితీస్తోంది. గోపాలమిత్రలకు నెలకు సుమారు రూ.7,500 గౌరవ వేతనం, సూపర్‌వైజర్లకు రూ.30 వేల వేతనం లభిస్తోంది.

రెగ్యులర్‌గా ఎలా చదివారో మరి..

గోపాలమిత్రలు పశువుల సంరక్షణ, టీకాలు వేయడం, రైతులకు అవగాహన కల్పించడం తదతర పనులు చేస్తుంటారు. అదే సమయంలో రెగ్యులర్‌గా చదివి ఇంటర్‌ పూర్తి చేయడం సాధ్యమా అన్న సందేహం వ్యక్తమవుతోంది. డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ లేదా ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివే అవకాశం ఉన్నా, పూర్తి స్థాయిలో పనిచేస్తూ చదువుకోవడం ఎంతవరకు న్యాయసమ్మతమన్నది విచారణలో తేలాల్సి ఉంది.

విచారణలో అధికారులు

ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించారు. అనుమానితులుగా ఉన్న అభ్యర్థుల విద్యార్హత పత్రాలు, వెయిటేజ్‌ మార్కుల కేటాయింపుపై పూర్తి స్థాయిలో పరిశీలన ప్రారంభించారు. సంబంధిత విద్యాసంస్థల నుంచి ధృవీకరణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. విచారణ పూర్తయ్యాక సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

యూనియన్ల తిరుగుబాటు

ఈ చర్యలను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చంద్రబాబు సర్కార్‌ తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి. విచారణను నిష్పక్షపాతంగా చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అవసరమైతే సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి.

అనుమానాలెన్నో..

గ్రామ/వార్డు సచివాలయ నియామకాల్లో గోపాలమిత్రలుగా పనిచేసిన వారికి గరిష్టంగా 15 మార్కుల వరకు వెయిటేజ్‌ ఇచ్చారు. విద్యార్హతలు పూర్తిచేసిన కాలం, సేవా కాలం మధ్య పోలికలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదువుకుంటున్న సమయంలోనే పని చేసినట్లు చూపించి, వెయిటేజ్‌ పొందడం నిబంధనలకు విరుద్ధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఫేక్‌ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లయితే, అది క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement