ఉచిత శిక్షణ.. ఉజ్వల భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

ఉచిత శిక్షణ.. ఉజ్వల భవిష్యత్తు

Apr 20 2026 8:29 AM | Updated on Apr 20 2026 8:29 AM

● క్రీడా అకాడమీల్లో శిక్షణకు దరఖాస్తులు ● రేపటి చాంపియన్లుగా ఎదిగే ఛాన్స్‌! ● తిరుపతి, విశాఖ, కాకినాడల్లో శాప్‌ అకాడమీలు

చిత్తూరు కలెక్టరేట్‌ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రోత్సాహం లేక మరుగున పడుతున్న క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) కార్యాచరణను ప్రకటించింది. విశాఖ, కాకినాడ, తిరు పతి నగరాల్లో ఉన్న శాప్‌ అకాడమీల్లో ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తూ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనుంది. ఈ అకాడమీల్లో 12 రకాల క్రీడల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలోని క్రీడాకారులు తమకు నచ్చిన క్రీడలో రాణించేందుకు ఈ నెల 26వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. తిరుపతి కేంద్రంలో బ్యాడ్మింటన్‌, జూడో, రైఫిల్‌ షూటింగ్‌, లాన్‌టెన్నిస్‌ (బాల, బాలికలకు), బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌లో (బాలికలకు) శిక్షణ ఇస్తారు. అలాగే కాకినాడ కేంద్రంలో వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌, హాకీ, ఖోఖో (బాలికలకు ప్రత్యేకం) శిక్షణ ఇస్తారు. విశాఖ కేంద్రంలో అథ్లెటిక్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, సైక్లింగ్‌ విభాగాల్లో (బాలురకు) శిక్షణ ఉంటుంది. 15 నుంచి 19 ఏళ్లలోపు వారు అర్హులు. 2008 జనవరి 1 నుంచి 2011 జనవరి 1 మధ్య జన్మించిన వారు ఈ ఎంపికలకు హాజరుకావచ్చు. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎస్‌పీవోఆర్‌టీస్‌.ఏపీ.జీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఎంపిక సమయంలో ఆధార్‌ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, 10 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలతో పాటు తమ క్రీడా కిట్‌ను వెంట తీసుకు వెళ్లాలి.

ఎంపిక తేదీలు

తిరుపతిలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఈ నెల 26న జూడో, బ్యాడ్మింటన్‌, 27న బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, 28న రైఫిల్‌ షూటింగ్‌, లాన్‌ టెన్నిస్‌, కాకినాడ డీఎస్‌ఏ మైదానంలో 29న వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌, 30న హాకీ, ఖోఖో, విశాఖపట్టణం కొమ్మాది మైదానంలో మే 4న అథ్లెటిక్స్‌, 5న సైక్లింగ్‌, 6న వాటర్‌ స్పోర్ట్స్‌ క్రీడల్లో విద్యార్థుల ఎంపికలు జరుగుతాయి.

తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయం

Advertisement
 
Advertisement
Advertisement