వి.కోట: మండలంలోని ఓగు గ్రామం వద్ద ఆదివారం బైక్‌ను కారు ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. రామకుప్పం మండలం బల్దారు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి (47) ద్విచక్ర వాహనంలో వి.కోట మండలంలోని ఓగు గ్రామం నుంచి వి.కోట వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని కారు వేగంగా వస్తూ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వేతనాలందక ఆశా కార్యకర్తలు అవస్థలు పడుతున్నారు. మార్చి నెల జీతం ఇంతవరకు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 50 పీహెచ్‌సీలు, 15 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 3 వేల మందికి పైగా ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. వీరికి మార్చి నెల వేతనాలు ఇంకా జమ కాలేదు. రోజువారీ ఖర్చులు కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నదని ఆశావర్కర్లు వాపోతున్నారు.
బడ్జెట్ సమస్య సాకు.?
జీతాల ఆలస్యంపై అధికారులను ప్రశ్నిస్తే ‘బడ్జెట్ సమస్య’ అని సమాధానం ఇస్తున్నారని ఆశావర్కర్లు చెబుతున్నారు. నెల గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వేతనాల విడుదలలో ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోందో స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బ్యానర్ల రగడ
– కొట్టుకున్న టీడీపీ నేతలు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా బ్యానర్లు కట్టే విషయంలో గుడిపాల మండలం బసవాపల్లి, రెట్టగుంట గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు కొట్టుకున్నారు. గతంలో టీడీపీకి చెందిన యువ నాయకుడు బ్యానర్లు కట్టాడు. ఇప్పుడు మరో యువ నాయకుడు ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతంలోనే చంద్రబాబునాయుడు పుట్టిన రోజుకు సందర్భంగా బ్యానర్లు కట్టాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి కొట్టుకున్నారు. అనంతరం ఇద్దరూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఆ పార్టీ పెద్ద నాయకులు రంగంలోకి దిగి పంచాయితీ చేసి ఇద్దరికీ సర్దిచెప్పారు. వారు నాయకుల మాట వినలేదు. అసంతృప్తిగా రాజీ చేసుకుని బయటికి వచ్చారు. ఇకపై తమ ప్రతాపం ఏమిటనేది చూపిస్తామని ఒక వర్గం వారు మరో వర్గం వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఎంత వరకు దారి తీస్తుందనేది వేచి చూడాల్సిందే.
కేసుల పరిష్కారంపై
ప్రత్యేక శ్రద్ధ చూపండి
– రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ జయసూర్య
చిత్తూరు అర్బన్: కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించడంలో న్యాయమూర్తులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ నినాల జయసూర్య ఆదేశించారు. చిత్తూరు నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో తిరుపతి, మదనపల్లి, చిత్తూరు ప్రాంతాల్లోని న్యాయ మూర్తులకు రెండో రోజైన ఆదివారం కూడా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై అవగాహన ఎలా పెంచుకోవాలి, తీర్పులను ఎలా ప్రభావితం చేస్తాయో వివరించారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారికతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.


