చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రకృతి పరిరక్షణలో పాలకులదే కీలక పాత్ర అని భారతీయ తెలుగు రచయితల సమాఖ్య జాతీయ గౌరవాధ్యక్షుడు మర్రిపూడి దేవేంద్రరావు, కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు ఎం.వి.శ్రీధర్‌రెడ్డి తెలిపారు. చిత్తూరులోని బ్రెయిన్ బాక్స్ అకాడమీలో ఆదివారం రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రకృతిపై కవి సమ్మేళనం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రకృతి వనరుల విధ్వంసం వల్ల జీవజాతులు 114 రెట్లు వేగంగా అంతరించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రచయితల సమాఖ్య అధ్యక్షుడు సి.నారాయణస్వామి మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ తక్షణమే స్పందించి పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు చూపాలన్నారు. ప్రముఖ రచయితలు నందిపాటి చక్రపాణి, తోటి గోవిందన్ మాట్లాడుతూ 2019 నాటికి వాయుకాలుష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో 62,808 మంది, తెలంగాణాలో 35, 364 మంది మరణించారని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో తెలుస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతిని పరిరక్షించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం 40 మంది కవులు, కవయిత్రులు, తెలుగు భాషాభిమానులను మర్రిపూడి దేవేంద్రరావు సన్మానించారు. కార్యక్రమంలో రచయితలు కొఠారి వెంకటరత్నం, ఎం.కన్నయ్య నాయుడు, జి.శాంతకుమారి, మిట్టా లక్ష్మి, వి.ఉషాకిరణ్, కీర్తిప్రియ, ఆర్.ఎన్.రాజన్, ఎస్.మునీంద్ర, ఎం.శ్రీరాజు, పాలకూరు కన్నయ్య, జగదీష్ కుమార్, రెడ్డిపల్లి షాజహాన్, అనంత పద్మనాభన్, దామోదరాచారి, తెలుగు భాషాభిమానులు కోటీశ్వర మొదలియార్, డి.రోహిత్, కె. హరిప్రసాద్ రెడ్డి, ఆనంద నాయుడు, భాస్కర్ రెడ్డి, కె.యర్రయ్య, రాజేంద్ర, మురళి, రమ్య, యమున, బ్రెయిన్ బాక్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు ఎస్.యువన్య తదితరులు పాల్గొన్నారు.


