చరిత్ర హీనులుగా మిగిలిపోతారు | - | Sakshi
Sakshi News home page

చరిత్ర హీనులుగా మిగిలిపోతారు

Apr 19 2026 7:35 AM | Updated on Apr 19 2026 7:35 AM

● మహిళా పక్షపాతి అంటూ కూటమి దగా ● ఇక్కడ బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్‌తో బాబు దోస్తీ ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

వెదురుకుప్పం: ప్రతిపక్షాలు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకోవడం ద్వారా చరిత్ర హీనులుగా మిగిలిపోయినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ మహిళలకు 50 శాతం రిజిర్వేషన్‌ కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి మహిళలను ఘోరంగా అవమానించారని చెప్పారు. మహిళల ఓట్లు కావాలని, చట్టసభల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించకూడదా అని ప్రశ్నించారు. 2023లోనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్న ప్రతిపాదనను తమ నాయకుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో పదవులు, నామినేటెడ్‌ పదవులు, సంక్షేమ పథకాల అమలులోనూ మహిళలకు పెద్ద పీట వేసినట్టు చెప్పారు.

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం

డీలిమిటేషన్‌ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలు భారీ గా నష్టపోయే ప్రమాదముందని నారాయణస్వామి తెలిపారు. 2011 జనాబా ప్రాతిపదికన తీసుకుంటే మరింత నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలగకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నది అందరి అభిమతమన్నారు. డీలిమిటేషన్‌ ద్వారా సీట్లు పెరుగుతాయనే ఆశాభావం ఉన్నప్పటికీ ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతో ప్రతిపక్షాలు ఆ బిల్లును వ్యతిరేకించాయని, కేంద్రం డీలిమిటేషన్‌ ప్రక్రియను అజెండాలో పెట్టి ఉంటే భాగుండేదన్నారు.

మహిళలకు చంద్రబాబు దగా

మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా నోరుమెదపడం లేదన్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని మహిళలు గమనించాలన్నారు. ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుని మహిళా పక్షపాతి అంటున్నాడని, తెలంగాణలో మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్‌తో చీకటి రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. ఆలాగే రెండేళ్లు కావస్తున్నా ఒక్క మహిళకు కూడా సెంటు ఇంటి స్థలం ఇవ్వలేదని మండిపడ్డారు. ఇదేనా మహిళలపై ఉన్న ప్రేమ అని ఎద్దేవా చేశారు. మహిళలకు అన్యాయం చేసిన పార్టీలు భవిష్యత్‌లో మనుగడ అసాధ్యమన్నారు. ఆడబిడ్డలు అన్ని రంగాల్లోనూ చైతన్యవంతులు అయితేనే సమాజం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement