చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సంజీవని ప్రాజెక్ట్‌పై రీఓరియంటేషన్ శిక్షణతో పాటు మాతా–శిశు ఆరోగ్యంపై శనివారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి, సీఎంసీ సంజీవని ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ తపన్ పాల్గొని వైద్యాధికారులు, సిబ్బందికి మార్గదర్శకాలను వివరించారు. వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సేవలను డిజిటలైజేషన్ చేయడం ద్వారా ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే సంజీవని ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. పేషెంట్ కేర్ సెంటర్ వద్ద ఆధార్ ఐడీ, మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ నుంచి అన్ని వైద్య సేవల వివరాలను డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. కాల్ సెంటర్ ద్వారా అపాయింట్‌మెంట్లు, స్పెషలిస్ట్ సేవలు, ఇంటి వద్ద అత్యవసర చికిత్స, రిమైండర్ సేవలు అందజేస్తామన్నారు. సంజీవని ప్రాజెక్టుపై ఈ నెల 21న కుప్పం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఎంహెచ్‌వోలకు విస్తృత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం మాతా శిశు ఆరోగ్యంపై సమీక్ష చేపట్టారు. గర్భిణుల తక్షణ నమోదు, హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, అవసరమైన పరీక్షలు, టీనేజ్ గర్భిణుల పర్యవేక్షణపై పలు సూచనలు చేశారు. అన్ని ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరగాలని, సమయానికి టీకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను 100 శాతం పూర్తి చేసి యూవిన్ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.


